మైనర్ బాలికపై మత గురువు అత్యాచారం
బెంగళూరు : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మైనర్ బాలికపై మత గురువు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రామనగర జిల్లా ఎస్పీ అనుపమ్ అగర్వాల్ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మండ్య జిల్లా మద్దూరు తాలూకా సోమపుర గ్రామానికి చెందిన దంపతుల కుమార్తె (15) ఇటీవల తొమ్మిదవ తరగతి ఉత్తీర్ణురాలైంది. వేసవి సెలవుల సందర్బంగా రెండు నెలల క్రితం రామనగరలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ అనారోగ్యానికి గురైన బాలికను చికిత్స కోసమని సమీపంలోని ప్రార్థన మందిరానికి తీసుకెళ్లారు. అక్కడి మౌల్వి.. సయ్యద్ ముజీర్ వీరి మూఢ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, బాలికకు దయ్యం పట్టిందని, వదిలిస్తానని నమ్మించాడు. ప్రార్థనా మందిరంలోకి ఆమెను ఒంటరిగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. సున్నితమైన చోట ఇనుప కడ్డీతో గుచ్చి పైశాచికంగా వ్యవహరించాడు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తానని బెదిరించి, బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించాడు. అతని వికృత చేష్టలకు భయపడిన బాలిక జరిగిన దారుణాన్ని ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. కొన్ని రోజుల తర్వాత తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్న బాలిక ఈ నెల 4న తీవ్ర అస్వస్థతకు లోనైంది. వెంటనే ఆమెను మండ్య జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితిని గమనించిన వైద్యులు విషయాన్ని పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు చేరవేశారు. పరారీలో ఉన్న నిందితున్ని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. సున్నితమైన చోట ఇనుప కడ్డీని చొప్పించడం వల్ల బాలిక తీవ్ర ఇన్ఫెక్షన్తో బాధపడుతోందని వైద్యులు వెల్లడించారు.