సింఫనీ సరిగమలు
బాల్యంలో చర్చ్‌లో పాటలు వింటూ తనదైన లోకంలోకి వెళ్లిపోయేవాడు డేవిడ్ చేస్. అప్పుడే అనిపించింది తనకి లైఫ్ ఈజ్ మ్యూజిక్ అని! అందుకే ప్యాషన్‌తో నేర్చుకున్న మ్యూజిక్‌ను ప్రొఫెషన్‌గా మార్చుకున్నాడు! నగరంలో పాశ్చాత్య సంగీతం పరిచయం లేని సమయంలోనే... ‘సింఫనీ అకాడమీ ఆఫ్ మ్యూజిక్’ ఏర్పాటు చేశాడు. 22 ఏళ్లుగా నగరానికి సంగీత సేవలందిస్తున్న డేవిడ్, ఆయన అకాడమీ ‘సింఫనీ’ పరిచయం..
భక్త రామదాసు మ్యూజిక్ కాలేజీలో శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్న డేవిడ్.. లండన్‌లోని ట్రినిటీ కాలేజీలో వెస్ట్రన్ మ్యూజిక్‌ను ఒంటబట్టించుకున్నాడు. శాస్త్రీయ సంగీతంతోపాటు, పాశ్చాత్య సంగీత పరిమళాలను సిటీవాసులకు పంచాలనుకున్నాడు. 1992లో ఎస్.ఆర్.నగర్లో ‘సింఫనీ అకాడమీ ఆఫ్ మ్యూజిక్’ ఏర్పాటు చేశాడు. నాటి నుంచి అప్రతిహతంగా సాగిపోతున్నదీ అకాడమీ.
కార్ఖానా, తార్నాక, నేరేడ్మెట్లలో ఉన్న ఈ అకాడమీల్లో పియానో, కీబోర్డ్, గిటార్, జాజ్డ్రమ్స్, ప్యడ్స్, కాంగో డ్రమ్స్, వయోలిన్, వెస్ట్రన్ మ్యూజిక్‌తోపాటు.. ఫ్లూట్, తబల, హార్మోనియం, వీణ, వయోలిన్, హిందూస్థానీ, కర్ణాటకవంటి శాస్త్రీయ సంగీతంలోనూ శిక్షణనిచ్చి, సర్టిఫికెట్స్ అందిస్తున్నారు. ఈ సర్టిఫికెట్తో విదేశాల్లో ఎడ్యుకేషన్‌కి మార్గం సుగమమవుతుండటంతో వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు.. ఇక్కడి విద్యార్థులకు స్కాలర్షిప్స్ కూడా లభిస్తున్నాయి.
నేర్చుకోవాలనుకుంటే...
సాధారణంగా ఏదైనా వాయిద్యం నేర్చుకోవాలనుకుంటే ఇన్స్ట్రుమెంట్ ఎవరికివారే తీసుకెళ్లాల్సి ఉంటుంది. విలువైన ఆ పరికరాలను కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాదు. అలాంటివారికి సింఫనీ అకాడమీనే ఇన్స్ట్రుమెంట్స్ అరే ంజ్ చేస్తుంది. వయసుతో నిమిత్తం లే కుండా ఎవరైనా ఇక్కడ సంగీతం నేర్చుకోవచ్చు. సింఫనీ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకున్నవారెందరో సొంతగా ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేశారు. మరికొందరు బ్యాండ్స్ ఏర్పాటు చేసుకున్నారు. సంగీతమే జీవితమనుకునే పేద విద్యార్థులకు తన అకాడమీలోనే ఉద్యోగావకాశం కూడా కల్పిస్తున్నాడు డేవిడ్.
అనాథలతో స్వరాలు..
సింఫనీ, సంపాదన అదే జీవితం కాదనుకున్నాడు డేవిడ్. అంధులను, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్‌ను, అనాథ బాలబాలికల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు.. రెండున్నర నెలల్లో 300 హోమ్స్ తిరిగాడు. మూడు వేల మంది పిల్లలను తీసుకొచ్చి ప్రతి శనివారం శిక్షణ ఇచ్చాడు.
2013లో అకాడమీ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా... హరిహరకళాభవన్ వేదికగా వాళ్లందరితో ప్రదర్శన ఇప్పించాడు. వీలున్నప్పడుల్లా... హోమ్స్‌కి వెళ్తుంటాడు. ‘20 ఏళ్లలో సంపాదించిన దానికంటే.. ఆ పిల్లలతో గడిపిన సమయమే తనకు ఎక్కువగా సంతృప్తినిచ్చింది’ అని చెబుతాడు డేవిడ్! వాళ్లలో కొందరినైనా ప్రొఫెషనల్ మ్యుజీషియన్స్ చేయాలన్నది తన లక్ష్యమంటాడు డేవిడ్!