శాంతి ర్యాలీ అనుమతికి హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ నగరంలో ఈ నెల 7వ తేదీన టీఎన్జీవోలు చేపట్టనున్న శాంతి ర్యాలీకి ప్రభుత్వం అనుమతించకపోవడంపై న్యాయవాదుల జేఏసీ కో కన్వీనర్ శ్రీరంగరావు రాష్ట్ర హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు చేపట్టనున్న భారీ బహిరంగ సభకు అనుమతించిన ప్రభుత్వం టీఎన్జీవోల ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని శ్రీరంగారావు కోర్టులో దాఖలు చేసిన పిటషన్లో పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం లేదా రేపు హైకోర్టులో ఆ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు ఈ నెల 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభను నిర్వహించనుంది. అందుకు అనుమతించాలని ఏపీఎన్జీవోల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, అనుమతిని మంజూరు చేసింది. అయితే కొన్ని షరతులు విధించింది. అయితే అదే రోజు తెలంగాణ ప్రాంత ఎన్జీవోలు నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించేందుకు మాత్రం ప్రభుత్వం నిరాకరించింది. దాంతో టీఎన్జీవోలు శాంతి ర్యాలీ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని శ్రీరంగారావు హైకోర్టును ఆశ్రయించారు.