అభ్యుదయ ‘దర్శక’ శిఖరం
ఒంగోలు కల్చరల్: చైతన్య గీతికలతో జగతిని మేల్కొలిపే వారు, ధ్రువ తారకలై ప్రకాశించే వారు ఏ కొందరో ఉంటారు. అందుకే ఓ సీనీ గేయకవి ‘నవ్వులు రువ్వే పువ్వమ్మా.. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా.. ఉన్న నాలుగు నాళ్లూ నీలా ఉండిపోతే చాలమ్మా’ అంటూ బతికిన నాలుగు రోజులూ పరుల కోసం బతకాలనీ, రాలిపోయిన తరువాత కూడా పదుగురి మనస్సుల్లో శాశ్వతంగా నిలిచిపోవాలని ప్రబోధించారు. ఇది నూటికి నూరుపాళ్లూ అక్షరాలా సంచలన సినీ దర్శకుడు దివంగత టి. కృష్ణకు వర్తిస్తుందని చెప్పవచ్చు.
జీవిత విశేషాలు..
తొట్టెంపూడి కృష్ణకుమార్ టి. కృష్ణ పూర్తి పేరు. జిల్లాలోని టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెంలో రత్తమ్మ, వెంకట సుబ్బయ్య దంపతులకు 1950 సెప్టెంబర్ 1న ఆయన జన్మించారు. సీఎస్ఆర్ శర్మ కళాశాలలో బీఏ చదివారు. కళాశాల జీవితం, మిత్రుల సాహచర్యం, ‘అన్న’ నల్లూరు వెంకటేశ్వర్లు పరిచయం టి. కృష్ణను మేటి కళాకారుడిగా, సంచలన సినీ దర్శకుడిగా తీర్చిదిద్దింది.
ఒంగోలు రాక..
చదువు కోసం తొలుత టి.కృష్ణ 1965లో ఒంగోలుకు వచ్చారు. టాగూరు ట్యుటోరియల్ కళాశాలలో మెట్రిక్ చదువు కోసం వచ్చి స్టూడెంట్ ఫెడరేషన్ మెస్‌లో చేరాడు. ప్రజానాట్య మండలి ఒడిలో, నల్లూరు వెంకటేశ్వర్లు శిక్షణలో పెరిగి తెలుగు సినీరంగంలో సంచలనాలు సృష్టించే అభ్యుదయ దర్శక శిఖరంగా ఎదిగాడు. సైన్స్ కోర్సు అయితే ప్రాక్టికల్స్ ఉంటాయని నాటక ప్రదర్శనలకు అవాంతరం కలుగకూడదనే ధ్యేయంతో బీఏ కోర్సు తీసుకుని పూర్తిచేసారు. నాటకరంగం పట్ల విపరీతమైన మక్కువ ఉన్న ఆయన పలు నాటక పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు సాధించారు. ఆయన చక్కటి గాయకుడు కూడా. మాదాల రంగారావు, ఎంవీఎస్ హరనాథరావు, ఇసుకపల్లి మోహనరావు తదితరులు కూడా ఆయనతో పాల్గొనే వారు. బొల్లిముంత శివరామకృష్ణ రచించిన సంభవామి యుగేయుగే నాటిక టి. కృష్ణకు మంచి పేరు తెచ్చింది. 1974లో ఖమ్మంలో జరిగిన ప్రజా నాట్య మండలి శిక్షణ సభల్లో గురజాడ వేషధారణతో అందరినీ అలరించారు.
సినీరంగంలోకి..
1969లో గుత్తా రామినీడు వద్ద ఒక సినిమాకు టి. కృష్ణ సహాయ దర్శకుడిగా పనిచేసారు. తరువాతి కాలంలో అభ్యుదయ చిత్రాలకు చిరునామాగా మారారు. మాదాల రంగారావు తీసిన యువతరం కదిలింది, విప్లవ శంఖం, ఎర్రమల్లెలు చిత్రాలకు ఆయన సహకారం అందించారు. మరో మిత్రుడు పోకూరి బాబూరావుతో కలసి ఈ తరం బ్యానర్‌పై ‘నేటి భారతం’ తీసి సంచలనం సృష్టించారు. పిదప ‘దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, వందేమాతరం, ప్రతిఘటన, రేపటి పౌరులు’ చిత్రాలను రూపొందించి దర్శకుడిగా అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ‘ఇందిన భారత’ అనే కన్నడ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ బాధ్యత నిర్వర్తించారు.
సంతానం..
టి. కృష్ణకు భార్య కోటేశ్వరమ్మతో పాటు ముగ్గురు సంతానం. నేడు ప్రముఖ సినీ హీరోగా తెలుగు చిత్రసీమలో వెలుగొందుతున్న టి. గోపీచంద్ టి కృష్ణ కుమారుడే.
దివికేగిన తార..
సంచలన సినీ దర్శకుడిగా తెలుగు సినీ సామ్రాజ్యాన్ని ఏలుతున్న రోజుల్లోనే ఆయన కేన్సర్ వ్యాధికి గురయ్యారు. మూడు నెలలపాటు అమెరికాలో చికిత్స కూడా పొందారు. అయినా ఆ వ్యాధి తగ్గలేదు. చెన్నై అపోలో ఆస్పత్రిలో ఇరవై రోజులపాటు చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. 1986 అక్టోబరు 21న అభిమానులను, ఆత్మీయులను దుఃఖసాగరంలో ముంచి తిరిగిరాని దూరతీరాలకు తరలిపోయారు. ఆయన భౌతికంగా నేడు లేకపోయినా ఆయన తీసిన సినిమాలు ఆయనను, ఆయనలోని అభ్యుదయ దృష్టిని నేటికీ గుర్తుచేస్తూనే ఉన్నాయి.
31 సంవత్సరాలుగా వర్థంతి సభలు..
ఒంగోలులో గత 31 సంవత్సరాలుగా టి. కృష్ణ వర్ధంతి సభలను ప్రతి ఏటా అక్టోబరు 20, 21 తేదీల్లో నల్లూరు వెంకటేశ్వర్లు సారధ్యంలో నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులను అందచేస్తున్నారు.
గోపీచంద్ ఔదార్యం..
ప్రతిభావంతులైన పేద విద్యార్థుల చదువు నిర్విఘ్నంగా పూర్తికావాలనే సదాశయంలో టి. కృష్ణ కుమారుడు, సినీ హీరో గోపీచంద్ ప్రతి ఏటా 20 మంది విద్యార్థులకు తన తండ్రి పేరిట ఉపకార వేతనాలను అందచేస్తూ ప్రోత్సహిస్తున్నారు.
అభ్యుదయానికి ప్రతిరూపం
అభ్యుదయానికి టి. కృష్ణ ప్రతిరూపం. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక సంచలనం. తన చిత్రాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఘనత ఆయనకు దక్కుతుంది. ప్రజానాట్య మండలి గర్వించదగిన గొప్ప కళాకారుల్లో టి కృష్ణ ఒకరు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. టి. కృష్ణ పేరిట వర్థంతి సభలను ప్రతి ఏటా నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తుండడం అభినందనీయం.
– నల్లూరు వెంకటేశ్వర్లు