కిరణ్‌ను తొలగించండి
దిగ్విజయ్‌కు టీ ప్రజాప్రతినిధుల ఫిర్యాదు
ఆయన నాయకత్వంపై విశ్వాసం లేదన్న నేతలు
అధిష్టానం చెప్పినట్టే సీఎం వింటారన్న దిగ్విజయ్
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. విభజన బిల్లు ముసాయిదా అసెంబ్లీలో చర్చకు రాకుండా అడ్డుకుంటున్న కిరణ్‌ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆయన నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజాప్రతినిధులెవరికీ విశ్వాసం లేదన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను పట్టించుకోని సీఎం తమకు వద్దే వద్దని శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు స్పష్టం చేశారు. బిల్లు సభకు రాకుండా కిరణ్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, డీకే అరుణ తదితరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కిరణ్ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటూ దిగ్విజయ్ వారికి నచ్చజెప్పారు. విభజన బిల్లుకు కిరణ్ కచ్చితంగా సహకరిస్తారని, బెట్టు చేస్తున్నట్టు కన్పించినా అధిష్టానం దారిలోకి వస్తున్నారని వివరించారు. ‘‘అధిష్టానం అనుకున్న ప్రకారమే టీ బిల్లు అసెంబ్లీ నుంచి పార్లమెంట్‌కు వస్తుంది. ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతారు. నేనిక్కడికి వచ్చిందే దాని కోసమని గుర్తుంచుకోండి. ఇరు ప్రాంతాల నాయకులను సమన్వయం చేసే పనిలో ఉన్నాను. అంతా సాఫీగా సాగిపోతుంది’’ అని చెప్పారు. సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. దాంతో వారు సంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు.
దామోదర ప్రతిపాదనే: అంతకుముందు మంత్రి డీకే అరుణ నివాసంలో తెలంగాణ నేతలంతా సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ, డీఎస్, మంత్రు లు జానా, శ్రీధర్‌బాబు, పొన్నాల, ఉత్తమ్, బసవరాజు సారయ్య, సుదర్శన్‌రెడ్డి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, జి.ప్రసాదకుమార్, గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్‌లు ఆరెపల్లి మోహన్, ఈరవత్రి అనిల్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని కిరణ్ తీరుపైనే చర్చించారు. ఆయనపై దామోదర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిరణే సీఎంగా కొనసాగితే యూపీఏ-2 హయాంలో తెలంగాణ ఏర్పడేలా లేదన్నారు. అందుకే కిరణ్‌ను తప్పించేదాకా అధిష్టానంపై ఒత్తిడి తేవడంతో పాటు వెంటనే దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. దాంతో అంతా గాంధీభవన్ వెళ్లారు. బిల్లును సభకురానీయకుండా సీఎం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని డీకే అరుణ ఆరోపించారు.
ఈ సీఎం మాకెందుకు?
శుక్రవారం దామోదర తొలుత అసెంబ్లీ లాబీలోని తన చాంబర్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేసి బిల్లును అసెంబ్లీకి ఎప్పుడు పంపుతున్నారంటూ వాకబు చేశారు. గవర్నర్ వద్దకు వెళ్తున్నానని, బిల్లు ప్రతులు అక్కడి నుంచి అసెంబ్లీకి వస్తాయని, ఇదంతా జరగడానికి మూడు గంటలు పడుతుందని సీఎస్ బదులిచ్చారు. కానీ మధ్యాహ్నం ఒకటైనా ప్రతులు రాకపోవడంతో, ‘‘కిరణ్ ఉండగా విభజన ప్రక్రియ సాఫీగా సాగే అవకాశం లేదు. తెలంగాణ ప్రజల మనోభావాలను పట్టించుకోని సీఎం మాకెందుకు? ఆయన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయారు. కిరణ్‌ను తక్షణం తప్పించాలి. అందుకోసం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించాలి’’ అని డిమాండ్ చేశారు. బిల్లు శుక్రవార ం అసెంబ్లీకి రాకపోవడాన్ని జానా కూడా తప్పుబట్టారు. బిల్లు సోమవారం అసెంబ్లీకి రాకపోతే కిరణ్‌ను తప్పించడమే లక్ష్యంగా తెలంగాణ నేతలమంతా కలిసి పోరాడతామని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు.
దిగ్విజయ్‌తో మల్లు భేటీ
డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం గాంధీభవన్‌లో దిగ్విజయ్‌తో సమావేశమయ్యారు. అసెంబ్లీ లో బిల్లు ప్రక్రియ సాఫీగా సాగేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. కచ్చితంగా ఈ సమావేశాల్లోనే బిల్లుపై సభ్యుల అభిప్రాయాలు వచ్చేలా చూడాలని, అవసరమైతే సమావేశాలను మరో వారం పొడిగించాలని దిగ్విజయ్ సూచించినట్టు తెలిసింది. దీనిపై నాదెండ్లతోనూ దిగ్విజయ్ ఫోన్లో మంతనాలు జరిపినట్టు సమాచారం.