సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు అనుమతి రద్దు చేయాలి: తెలంగాణ న్యాయవాదులు
సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున ఈ నెల 7వ తేదీన ఏపీఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు అనుమతి రద్దు చేయాలని తెలంగాణ న్యాయవాదులు టి.శ్రీరంగారావు, ఎస్.శ్రీనివాస్‌లు హైకోర్టును కోరారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోల సభకు అనుమతి మంజూరు చేస్తూ డీసీసీ కమలాసన్‌రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను వారు సవాల్ చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ నూతి రామ్మోహనరావు విచారించారు. పిటిషనర్ల తరఫున గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మాత్రమే నిర్ణయం తీసుకుందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
దీనికీ, ఉద్యోగస్తులకు ఎటువంటి సంబంధం లేదని, అయినా ఏపీఎన్జీవోలు గత నెల 12 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారని, ఇలా సమ్మె చేసే హక్కు వారికి లేదని అన్నారు. ఇక్కడ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వమని, విభజనకూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి, ఏపీఎన్జీవోలు చేస్తున్న సమ్మె ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం ఎలా అవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఏపీఎన్జీవోలు ప్రత్యక్షంగా రాజకీయ కార్యకపాల్లో పాల్గొంటున్నారని, ఈ నెల 7న సభ కూడా నిర్వహిస్తున్నారని మోహన్‌రావు చెప్పారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘30 ఏళ్ల తరువాత ప్రభుత్వ ఉద్యోగులెవరికీ ఎటువంటి పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించబోమని, కేవలం పనిచేసిన రోజులకు మాత్రమే జీతం ఇస్తానంటూ ఓ రాజకీయ పార్టీ తమ ఎజెండాలో భాగంగా ప్రకటన ఇచ్చిందనుకున్నాం. ఆ ప్రకటన ఇచ్చింది ఓ రాజకీయ పార్టీ కాబట్టి, దానికి వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె, ఆందోళనలు కార్యక్రమాల్లో పాల్గొంటే అది చట్ట విరుద్ధం అవుతుందా..? భవిష్యత్తరాలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఇప్పుడున్న ఉద్యోగులు సమ్మె, ఆందోళనలు చేయడం సరికాదంటారా..? అది అన్యాయం అవుతుందా.?’ అని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ వెంటనే తమ ఎజెండాలోని అంశాలను అమలు చేస్తుందని, ఇదే రీతిలో ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేయడాన్ని అందరం చూశామంటూ వ్యాఖ్యానించారు. గతంలోనూ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం జరిగిందని, అటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే తాము 7వ తేదీ సభకు అనుమతిని రద్దు చేయాలని కోరుతున్నామని మోహన్‌రావు చెప్పారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘ఈ మొత్తం వ్యవహారానికి అనవసర ప్రాముఖ్యతను ఇస్తున్నామని మీకు అనిపించడం లేదా..?’ అని ప్రశ్నించారు. మీరేమంటారని హోంశాఖ తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డిని అడిగారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే, ఏపీఎన్జీవోల సభకు అనుమతినిచ్చామని ఆయన తెలిపారు. సభకు వచ్చే ప్రతి ఉద్యోగి గుర్తింపు కార్డును పరిశీలించడం జరుగుతుందని, గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే సభకు అనుమతినిస్తారని, ఆ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన వివరించారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఓ స్పష్టమైన నియమావళి ఉంది.
ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా వచ్చిన దాంట్లో నుంచే వారికి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయపరమైన సమావేశాలు, సభలు నిర్వహించవచ్చా..? రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చా..? సభకు ఉద్యోగులు మాత్రమే హాజరు కావాలని ఎందుకు స్పష్టమైన షరతు విధించలేదు.’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.