Tabla
-
ప్రముఖ సంగీత విద్వాంసుడు కన్నుమూత..
Tabla Musician Tabla Prasad Passed Away: ప్రముఖ సంగీత విద్వాంసుడు 'తబలా ప్రసాద్' శుక్రవారం (మార్చి 18) ఉదయం కన్నుమూశారు. తబలా ప్రసాద్ 70 సంవత్సరాలకుపైగా తమిళం, హిందీ, తెలుగులో 4 తరాల స్వరకర్తలతో పనిచేశారు. ఆయన తబలా సంగీతం ఇచ్చిన ఎన్నో పాటలు హిట్ అయ్యాయి. ఉత్తర భారదేశంలో ఆర్డి బర్మన్, సి. రామచంద్ర, లక్ష్మీకాంత్ ప్యారీలాల్, నవ్‌షత్, పప్పిలహరితోపాటు సౌత్ ఇండియాలో స్క్రీన్ మ్యుజిషియన్ తిలక్ కెవిఎం, మెలోడీ కింగ్ ఎమ్ఎస్వి, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా వంటి చాలా మందికి తబలా వాయించారు. అంతేకాకుండా ఈ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా, జివి ప్రకాష్‌తో కలిసి ఐదుకుపైగా భాషల్లో సుమారు 2500 చిత్రాలకు పనిచేశారు. వీటన్నింటితో కలిపి దాదాపు 60000 పాటలకు ఆయన తబలా వాయించారు. 79 ఏళ్ల తబలా ప్రసాద్‌కు భార్య కృష్ణవేణి, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన కుమారులైన రమణ, కుమార్‌లు కూడా సంగీత విద్వాంసులుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తబలా ప్రసాద్ భౌతికకాయానికి శనివారం చెన్నైలోని వడపళనిలో ఉన్న ఏవీఎం స్డూడియో సమీపంలో ఉన్న శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. -
నాదం సృష్టించే చేతులు
తబల, మృదంగం వంటి చర్మవాద్యాల తయారీ అనాదిగా పురుషుల పని. కాని బెంగళూరుకు చెందిన అశ్వత్థమ్మ గత ఆరు దశాబ్దాలుగా ఈ కళలో ఆరితేరారు. నాదాన్ని సృష్టించే చేతులు స్త్రీలవి కూడా కాగలవని నిరూపించారు. భారతీయ సంప్రదాయ సంగీతంలో కొన్ని వందల వాద్య పరికరాలు ఉన్నాయి. అందులో కొన్ని తంత్రీ వాద్యాలైతే, కొన్ని చర్మ వాద్యాలు. వీటిని తయారుచేయటానికి ఎంతో కొంత సంగీత పరిజ్ఞానం ఉండాలి. స్వరస్థానాలను గుర్తించగలిగే శక్తి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక వాద్య పరికరం శృతిపక్వంగా తయారవుతుంది. ముఖ్యంగా తబలా, మృదంగం వంటివి తయారు చేయటం చాలా కష్టం. వాటి తయారీకి కలపతోపాటు జంతు చర్మాలను ఉపయోగిస్తారు. సాధారణంగా వీటిని మగవారే తయారుచేస్తారు. కాని పురుషులకు ఏ మాత్రమూ తీసిపోను అంటూ ఇప్పటి వరకు 10 వేల పరికరాలు తయారుచేశారు బెంగళూరుకు చెందిన అశ్వత్థమ్మ. ‘‘మా వారు ఆర్ ఎస్ అనంతరామయ్య సంగీతకారులు. ఆయన తబలా, మృదంగ వాద్యాలలో నిపుణులు. నా పదిహేనో ఏట నాకు వివాహమైంది. నేను వంటతోపాటు మావారి దగ్గర వాద్యపరికరాల తయారీ, వాటిని బాగు చేయటం రెండూ నేర్చుకున్నాను.’’ అంటున్న అశ్వత్థమ్మ బెంగళూరు బాలాపేట్ సర్కిల్లోని శాంతా తబలా వర్క్స్‌లో పని చేస్తున్నారు. ‘‘ఈ పరికరాల తయారీకి శారీరక బలం చాలా అవసరం. గట్టి గట్టి దెబ్బలు కొడుతూ వాద్యాలు తయారు చేయడం మగవారికి మాత్రమే అలవాటు. అటువంటిది నా కండ బలంతో ఈ కళలో నైపుణ్యం సాధించాను’’ అంటారు 75 సంవత్సరాల అశ్వత్థమ్మ. సంగీతానికి సంబంధించి ఎటువంటి కోర్సులు చేయలేదు అశ్వత్థమ్మ. స్కూలు చదువులు కూడా లేవు. కాని, వాద్యపరికరాలు తయారుచేసేటప్పుడు అందులో పలికే అపశృతులను గుర్తించగలరు. వాటిలోని మాధుర్యం తెలుసుకోగలరు. బెంగళూరులో ఎవరికి వాద్యపరికరాలు కావాలన్నా శాంతా తబలా వర్క్స్‌కి రావలసిందే. అశ్వత్థమ్మ భర్త అనంతరామయ్య దేవాలయాల్లోను, నాటకాలలోను తబలా, మృదంగం వాయించేవారు. ఆ రోజుల్లో కచేరీలకు పెద్దగా డబ్బులు వచ్చేవి కాదు. అందువల్లే వాద్యపరికరాల తయారీ ప్రారంభించారు. అశ్వత్థమ్మ ఆ పని నేర్చుకున్నారు. భార్యాభర్తలు ఈ పనులు చేస్తున్నందుకు బంధువుల నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ‘‘వాద్యపరికరాలను జంతు చర్మాలతో చేస్తారని అందరికీ తెలిసిందే. మా కుటుంబమంతా దేవాలయాలలో పనిచేసేవారు. మేము జంతుచర్మాలతో పనిచేస్తున్నందుకు, మమ్మల్ని దూరం పెట్టారు. మగవారు చేసే మృదంగం పనులు చేయటం ఎందుకు అంటూ నన్ను ఎగతాళి చేసేవారు. వాస్తవానికి జంతుచర్మాలతో తయారుచేసే పరికరాలకు శక్తి కంటె తెలివి ఉండాలి’’ అంటారు అశ్వత్థమ్మ. తబలాను రిపేర్ చేయడానికి వారం రోజులు, మృదంగమైతే పది రోజుల సమయం పడుతుంది. ఈ వాద్యాలను పనస చెక్క, మామిడి చెక్కలతో పాటు ఇతర చెక్కలతోను తయారు చేస్తారు. ఆవు, గేదె, మేక చర్మాలను పరికరాల తోలుకోసం ఉపయోగిస్తారు. ‘‘నేను సుమారు వంద రకాల వాద్య పరికరాలను తయారు చేస్తాను. ఇప్పటివరకు కొన్ని వందల రిపేర్లు చేశాను’’ అంటారు ఆమె. ప్రముఖ సంగీత విద్వాంసులందరూ అశ్వత్థమ్మ దగ్గరే బాగు చేయించుకుంటారు. ఈ అరవై సంవత్సరాలలో అశ్వత్థమ్మ చేతి నుంచి 10000 వాద్యపరికరాలు కళాకారుల చేతుల్లోకి వెళ్లాయి. తబలా, మృదంగం, ఢోలక్, ఢోల్కీ, ఢమరుకం, నగారీ, కంజరా వంటివి తయారవుతుంటాయి. ‘మా వారికి కర్ణాటక కళాశ్రీ బహుమతి వచ్చింది. ప్రస్తుతం మా అబ్బాయి శ్రీనివాస్ ఈ సంస్థను ముందుకు తీసుకువెళ్తున్నాడు’ అంటూ సంతోషంగా చెబుతారు అశ్వత్థమ్మ. – వైజయంతి -
బెస్ట్ ఫీలింగ్స్
ఈ బుజ్జి బుడతడు ముద్దులొలికే మోముతో, వచ్చీరాని పదాలతో పాట పాడుకుంటూ, పెద్ద జాకీర్ హుస్సేన్లానో లేదా అల్లా రఖాలాగానో అనుభూతి చెందుతూ తల ఆడిస్తూ, తబలా వాయించేస్తూన్నాడు! వాళ్ల పేర్లు, వాళ్లు ఎవరు అనే విషయం కూడా ఈ చంటిగాడికి తెలియదు. తాజ్ టీ ప్రకటనలో జాకీర్ తల ఆడించినట్లుగా ఈ బాలమేధావి కూడా జట్టును అటు ఇటు తెగ కదిపేస్తున్నాడు. ఈ బాల గంధర్వుడి కారణంగా తబలా వీడియో వైరల్ అవ్వడమే కాదు, నెటిజన్ల హృదయాలను ఆనందంలో ఓలలాడిస్తోంది. ఒడియా గాయని సోనా మహాపాత్రా పోస్ట్ చేసిన వీడియో ఇది. ఈ చిన్నారి తబలా వాయిస్తూ, ప్రొఫెషనల్ సింగర్లాగ పాడుతున్న వీడియోను రీసర్ఫేస్ చేసింది సోనానే. 2013 నాటి ‘ఫక్రే’ చిత్రం కోసం ఆమె పాడిన సూపర్ హిట్ సాంగ్ ‘అంబర్సారియా’ను చిట్టి చిన్నారి తబలా వాయిస్తూ పాడటం సోనాను ఆకర్షించడంతో తన ట్విటర్లో షేర్ చేశారు. ‘‘బెస్ట్ ఫీలింగ్స్ ఇన్ ఏజెస్... వాచింగ్ దిస్’’ అని క్యాప్షన్ కూడా పెట్టారు సోనా. ఏ మాత్రం కష్టం లేకుండా అవలీలగా పాడటం చూసి చాలామంది ఆ బాలకుడిని అభినందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. కళ్లు మూసుకుని, స్వాత్మానందం చెందుతూ, చేతులను కదుపుతూ తన అనుభూతిని తెలియచేస్తూ అబ్బుర పరుస్తున్నాడు. ఎంతో సులువుగా, ఒక అనుభవజ్ఞుడిలా పాడుతూ వాయించడం అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తమిళ్ పాండ్యన్ అనే ఒక ట్వీటర్, ‘‘ఆ చేతివేళ్లలో లయ ఉంది... చైల్డ్ ప్రాడిజీ... సరైన విధానంలో శిక్షణ ఇచ్చి, ప్రోత్సహిస్తే గొప్ప కళాకారుడు అవుతాడు’’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ చంటిగాడి పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. మొదట 2015 సెప్టెంబర 6న అప్లోడ్ అయిన ఈ వీడియో.. మూడురోజుల క్రితం సోనా మహాపాత్రా పోస్టుతో ఆమెను మళ్లీ ఇంటింటి గాయనిగా మార్చేసింది. -
తబలా వాయిద్యంలో మేటి ‘పాయల్’
డిచ్పల్లి: పాయల్ కోటగిర్‌కర్ సల్ల. సంగీత ప్రపంచంలో ఈ పేరు వినని వారుండరు. మహిళలు అరుదుగా ఎంచుకునే తబలా వాయిద్యంలో జాతీయ స్థాయి యువ కళాకారిణిగా పాయల్ ఎదిగారు. సంగీత నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన పాయల్ చిన్ననాటి నుంచే తన బాబాయి కృష్ణ కోటగిర్‌కర్ వద్ద తబలా వాయిద్యంలో ఓనమాలు నేర్చుకున్నారు. 2002లో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేశారు. 2004లో శ్రీత్యాగరాజ ప్రభుత్వ సంగీత కళాశాల, రాంకోటి, హైదరాబాద్ నుంచి డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు ఉస్తార్ షబ్బీర్ నిస్సార్ వద్ద శిష్యరికం చేశారు. 2008 నుంచి 2017 వరకు జ్ఞాన సరస్వతి సంగీత నృత్య పాఠశాల, నిజామాబాద్‌లో ‘హానరోరియం బేసిక్’ పద్ధతిన సహాయ అధ్యాపకురాలిగా పనిచేశారు. తబలాతో పాటు హిందుస్తానీ వోకల్‌లోనూ ప్రావీణ్యం సాధించి సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయినగర్‌లో పుట్టి పెరిగిన పాయల్ ఖలీల్వాడీలోని మోడరన్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి, నిర్మల హృదయ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్, అంబేద్కర్ ఓపెన్‌యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. కళారంగంలో అంచెలంచెలుగా ఎదిగిన పాయల్ దేశ రాజధాని ఢిల్లీ, బెంగుళూరు, కోల్కత్తా, చెన్నై, ముంబయి, బళ్లారి, పూణె, హైదరాబాద్ నగరాల్లో తబలా వాయిద్య ప్రదర్శనలిచ్చారు. ఇప్పటి వరకు పట్టణాలు, నగరాలతో పాటు టెలివిజన్, రేడియోల్లో కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు. వందల మంది శిష్యులకు తబలా వాయిద్యంలో శిక్షణ నిచ్చారు. ప్రముఖ మృదంగ విద్యాంసుడు యెల్లా వెంకటేశ్వరరావు, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి, గాయని ఎస్పీ శైలజ వంటి ప్రముఖుల నుంచి పాయల్ ప్రశంసలందుకున్నారు. 2008లో నేషనల్ గోల్డ్ మెడల్, రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో నాలుగు సార్లు అవార్డులు, జిల్లా స్థాయిలో వందల సంఖ్యలో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ‘ఇందూరు అపురూప’ అవార్డుతో పాటు నిజామాబాద్ రోటరీ క్లబ్ ద్వారా ‘డాటర్ ఆఫ్ నిజామాబాద్’, ‘మార్తాంగిక శిరోమణి’వంటి అవార్డులు అందుకున్నారు. తనదైన కళా ప్రదర్శనలతో తబలా వాయిద్య కళా ప్రియుల మనసు దోచుకున్న ఆమె కళారంగంలోనే కాకుండా రాజకీయంలో రాణించారు. మెట్టినిల్లు డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామ ఎంపీటీసీ సభ్యురాలి(2014)గా ప్రజలకు సేవలిందించారు. 2017లో రాష్ట్ర ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి ‘తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ప్రముఖ తబలా కళాకారిణి’ అవార్డు, లక్ష రూపాయల నగదుతో సత్కరించింది.2018లో టీఎస్పీఎస్సీ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో సంగీతం, తబలా ఉపాధ్యాయురాలిగా ఎంపికైంది. దీంతో ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి సంగీత ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం జూలై 30, 2018 నుంచి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల, ఆర్మూర్‌లో తబలా, సంగీత ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. కళాకారిణిగా రాణించడంలో తల్లిదండ్రులు గంగాధర్, జయశ్రీ, కుటుంబసభ్యులు, భర్త హిరికృష్ణ శర్మ ప్రోత్సాహం ఎంతో ఉందని పాయల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను గుర్తించి తగిన విధంగా ప్రోత్సహించడం ఆనందంగా ఉందని మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పాయల్ సూచిస్తున్నారు. -
పదకొండేళ్ల తబలా విద్వాంసుడు
ప్రతిభా కిరణం పాండిచ్చేరిలోని ఆరోవిల్‌లో పదకొండేళ్లక్రితం పుట్టిన కేశవ్ తబలా వాద్యకారుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కేశవ్ రెండు సంవత్సరాల వయసు నుండి తబలా నేర్చుకోవడం మొదలు పెట్టి ఏడు సంవత్సరాల వయసులో న్యూఢిల్లీలోని కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ప్రదర్శన ఇచ్చాడు. అది అతని మొదటి ప్రదర్శన. ఎలాంటి అవరోధం లేకుండా పూర్తయిన ఆ ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కేశవ్లోని ప్రతిభను మొదటగా గుర్తించింది చిత్రకారిణి అయిన అతని అమ్మమ్మ ప్రఫుల్ల దహనుకర్. మొదటి పాఠాలు అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాడు. తరువాత ప్రజాప్రదర్శలను ఇచ్చే తబలా వాద్యకారుడు గణేశ్ బసవరాజుగారి చేతి కదలికలు నిశితంగా పరిశీలించేవాడు. తరువాత ఇంటికి వచ్చి ఆయన చేతి కదలికలను అనుకరిస్తూ తబలా వాయించేవాడు. కేశవలోని ఆసక్తిని తెలుసుకున్న బసవరాజు తనకు తీరిక దొరికినప్పుడల్లా తబలాలో తర్ఫీదు ఇచ్చాడు. కేశవ్ గిటార్‌ను కూడా అద్భుతంగా ప్లే చేయగలడు. మిగతా పిల్లల్లాగే సైకిల్ తొక్కడం, చెట్లు ఎక్కడం, చందమామ కథలు చదవడం కేశవ్‌కి ఎంతో ఇష్టం. ఈ బుడతడిని ఆదర్శంగా తీసుకుంటే, ఒక పక్క చదువుకుంటూనే నచ్చిన రంగంలోనూ రాణించవచ్చు.