ఈ బుజ్జి బుడతడు ముద్దులొలికే మోముతో, వచ్చీరాని పదాలతో పాట పాడుకుంటూ, పెద్ద జాకీర్ హుస్సేన్‌లానో లేదా అల్లా రఖాలాగానో అనుభూతి చెందుతూ తల ఆడిస్తూ, తబలా వాయించేస్తూన్నాడు! వాళ్ల పేర్లు, వాళ్లు ఎవరు అనే విషయం కూడా ఈ చంటిగాడికి తెలియదు. తాజ్ టీ ప్రకటనలో జాకీర్ తల ఆడించినట్లుగా ఈ బాలమేధావి కూడా జట్టును అటు ఇటు తెగ కదిపేస్తున్నాడు. ఈ బాల గంధర్వుడి కారణంగా తబలా వీడియో వైరల్ అవ్వడమే కాదు, నెటిజన్ల హృదయాలను ఆనందంలో ఓలలాడిస్తోంది. ఒడియా గాయని సోనా మహాపాత్రా పోస్ట్ చేసిన వీడియో ఇది.
ఈ చిన్నారి తబలా వాయిస్తూ, ప్రొఫెషనల్ సింగర్‌లాగ పాడుతున్న వీడియోను రీసర్ఫేస్ చేసింది సోనానే. 2013 నాటి ‘ఫక్రే’ చిత్రం కోసం ఆమె పాడిన సూపర్ హిట్ సాంగ్ ‘అంబర్‌సారియా’ను చిట్టి చిన్నారి తబలా వాయిస్తూ పాడటం సోనాను ఆకర్షించడంతో తన ట్విటర్‌లో షేర్ చేశారు. ‘‘బెస్ట్ ఫీలింగ్స్ ఇన్ ఏజెస్... వాచింగ్ దిస్’’ అని క్యాప్షన్ కూడా పెట్టారు సోనా. ఏ మాత్రం కష్టం లేకుండా అవలీలగా పాడటం చూసి చాలామంది ఆ బాలకుడిని అభినందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. కళ్లు మూసుకుని, స్వాత్మానందం చెందుతూ, చేతులను కదుపుతూ తన అనుభూతిని తెలియచేస్తూ అబ్బుర పరుస్తున్నాడు.
ఎంతో సులువుగా, ఒక అనుభవజ్ఞుడిలా పాడుతూ వాయించడం అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తమిళ్ పాండ్యన్ అనే ఒక ట్వీటర్, ‘‘ఆ చేతివేళ్లలో లయ ఉంది... చైల్డ్ ప్రాడిజీ... సరైన విధానంలో శిక్షణ ఇచ్చి, ప్రోత్సహిస్తే గొప్ప కళాకారుడు అవుతాడు’’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ చంటిగాడి పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. మొదట 2015 సెప్టెంబర 6న అప్‌లోడ్ అయిన ఈ వీడియో.. మూడురోజుల క్రితం సోనా మహాపాత్రా పోస్టుతో ఆమెను మళ్లీ ఇంటింటి గాయనిగా మార్చేసింది.
Comments
Please login to add a commentAdd a comment