నదిలో పడిన విమానం
తైపీ: తైవాన్‌లో బుధవారం ఒళ్లు గగుర్పొడిచేలా జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 26 మంది మృతిచెందగా, 17 మంది గల్లంతయ్యారు. ట్రాన్స్ ఏసియా ఎయిర్వేస్కు చెందిన ఓ విమానం తైవాన్ రాజధాని తైపీలో ఓ ఫ్లైఓవర్‌ను ఢీకొని పక్కనే ఉన్న నదిలో పడిపోయింది. అంతకుముందు దాని రెక్క రోడ్డుపై వెళ్తున్న ఓ ట్యాక్సీని ఢీకొనడంతో డ్రైవర్‌తోపాటు మరొకరికి గాయాలయ్యాయి.
ట్రాన్స్ ఏసియా విమానం 'ఫ్లైట్ జీఈ235' ఐదుగురు సిబ్బంది సహా మొత్తం 58 మందితో ఉత్తర తైపీలోని సాంగ్షాన్ విమానాశ్రయం నుంచి 10.53 గంటలకు కిన్మెన్ ద్వీపానికి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకుంది. 11.00 గంటల ప్రాంతంలో ఓ పక్కకు ఒరిగి ఫ్లైఓవర్‌ను ఢీకొని ముందుకెళ్లి ముక్కచెక్కలవుతూ నదిలో పడిపోయింది. శకలాల నుంచి సహాయక సిబ్బంది 15 మందిని రక్షించారు. ప్రయాణికుల్లో 31మంది చైనీయులు ఉన్నారు. క్రేన్ల సాయంతో విమానం వెనుక భాగాన్ని వెలికి తీయగా అందులో ఒక ప్రయాణికుడి మృతదేహం లభించింది. గల్లంతైన 17 మంది నదిలో మునిగిన విమానం ముందు భాగంలో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.
నీటి మట్టం పెరగడం, రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. విమానం బ్లాక్ బాక్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 'విమానం ఢీకొన్న ట్యాక్సీ నాకు కొన్ని మీటర్ల ముందే ఉంది. విమానం నాకు దగ్గరగా వచ్చింది. ఇప్పటికీ భయం పోలేదు' అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. కాగా, విమాన సిబ్బంది సందేశంగా పేర్కొంటూ టీవీ చానళ్లలో ఒక సంభాషణ ప్రసారమైంది. అందులో.. 'మేడే! మేడే! ఇంజిన్ మండిపోతోంది! అని అరుస్తున్నట్లు ఉంది. ట్రాన్స్ ఏసియా విమానమొకటి ప్రమాదానికి గురికావడం ఏడు నెలల్లో ఇది రెండోసారి.