మదర్‌థెరిస్సాను స్ఫూర్తిగా తీసుకోవాలి
వీరన్నపేట (మహబూబ్‌నగర్) : సమాజసేవయే పరమావదిగా.. తన చివరి తుదిశ్వాస వరకు సమాజ సేవలో తరించిన మదర్ థెరిస్సాను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ఆమె అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని బోయపల్లిలో మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో థెరిస్సా జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు సమకూర్చిన చీరలను 150 మంది నిరుపేద వద్ధులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న దీనావస్థను చూసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. ఎందరికో ఆపన్నహస్తం అందించి ప్రపంచంలోని ప్రతిఒక్కరి గుండెల్లో గూడు కట్టుకుందని అన్నారు. అలాంటి మానవతావాది జయంతి రోజు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. రక్తదానం విషయంలో అపోహాలకు గురికాకుండా జీవితకాలం వీలైనన్ని సార్లు రక్తాన్ని దానం చేయాలని సూచించారు. అనంతరం ట్రస్టు సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శరత్చంద్ర, ట్రస్టు అధ్యక్షుడు నాగరాజుగౌడ్. మాజీ సర్పంచ్ నర్సిములు, టీఆర్ఎస్ నాయకులు వెంకట్రాములు, ఆంజనేయులు, సత్యనారాయణ, బాలరాజుగౌడ్, రామకష్ణ. తిరుపతయ్య, నాగిరెడ్డి, మనోహర్‌రావు, మాసయ్య పాల్గొన్నారు.