విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి
తలకొండపల్లి: ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఏంపీడీఓ శ్రీనివాసాచార్య వంట ఏజెన్సీలతో పాటు, ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం మండల పరిధిలోని యడవల్లిలో అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాల, చెన్నారంలో ఆసరా పింఛన్ల పంపిణీతో పాటు, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి తనిఖీ చేశారు. చెన్నారం, చుక్కాపూర్లలోని ఉపాధి హామి పనులను పరిశీలించారు.
యడవల్లిలో అంగన్వాడీ కార్యకర్త గైర్హాజరీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాలలో వారంలో రెండు గుడ్లు మాత్రమే విద్యార్థులకు అందిస్తున్నారని తెలుసుకుని ఆగ్రహించారు. వారంలో తప్పనిసరిగా మూడు గుడ్లను విద్యార్థులకు అందించాలని సూచించారు. ఆయా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలన్నారు. కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ఉపాధి పనులను చేపట్టి, వ్యవసాయాభివృద్ధి పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఉపాధి సిబ్బందికి సూచించారు.