హైదరాబాద్‌ను 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా అంగీకరించం
హైదరాబాద్ : హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా అంగీకరించమని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అన్నారు. మంత్రుల బృందానికి ఇచ్చిన నివేదికపై టీజేఏసీ శనివారమిక్కడ సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ మూడేళ్లకు మించి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేందుకు వీల్లేదన్నారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకే నీటి పంపిణీ జరగాలన్నారు.
ప్రత్యేక రాష్ట్రంతోనే అన్ని సమస్యలకు పరిష్కారమని కోదండరాం వ్యాఖ్యానించారు. మిగతా రాష్ట్రాలకు కల్పించే అన్నిహక్కులను తెలంగాణకు కల్పించాలన్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని వనరుల వినియోగానికి సంపూర్ణ అధికారం తెలంగాణకు ఉండాలన్నారు. తెలంగాణ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు రూపకల్పన జరగాలని డిమాండ్ చేశారు. విభజనకు 371డీ ఆర్టికల్ అడ్డురాదని ఉద్యోగ సంఘాల టీజేఏసీ అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు.