సహోద్యోగులను చంపిన ‘ఉగ్రపోలీసు’
కాందహార్: అఫ్గాన్ లో సహోద్యోగులపై ఓ పోలీసు దారుణానికి తెగబడ్డాడు. సోమవారం అఫ్గాన్ లోని హెల్మాండ్‌లోని దక్షిణ ప్రాంతం సమీపంలోని ఓ చెక్‌పోస్టు వద్ద సహోద్యోగులపై తాలిబన్ ఉగ్ర సంస్థతో సంబంధాలున్న ఓ పోలీసు జరిపిన కాల్పుల్లో 11 మంది పోలీసులు మృతి చెందారు.
పోలీసు శిబిరంలో నిద్రిస్తున్న పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆ ప్రదేశమంతా రక్తసిక్తమైంది. కాల్పుల అనంతరం పోలీసు శిబిరంలో ఉన్న ఆయుధాలను తీసుకుని పారిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు.