నాకిది పునర్జన్మ
చెన్నై, సాక్షి ప్రతినిధి: కుటుంబ సభ్యుల ప్రార్థనలు ఫలిం చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి సత్ఫలితాలను ఇచ్చింది. తీవ్రవాదుల చెరలో 8 నెలల పాటు బందీగా గడిపిన ఫాదర్ అలెక్స్ ప్రేమ్‌కుమార్ ఎట్టకేలకు విముక్తి పొందారు. శివగంగైలోనితన స్వగ్రామానికి సోమవారం సురక్షితంగా చేరుకున్నారు. నిజంగా నాకిది పునర్జ్మేనని ఆయన ఆనంద భాష్పాలతో తెలిపారు. తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లా దేవకోట్టై సమీపం వారియన్వయల్ గ్రామానికి చెందిన అలెక్స్ ప్రేమ్‌కుమార్ (47) ఏసు సభ ఫాదర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటలీ రోమ్నగర్ కేంద్రంగా పనిచేసే జేఆర్ఎస్ అనే స్వచ్ఛంద సంస్థలో చేరారు. భార త దేశంలో 50కి పైగా ఉన్న ఆ సంస్థ శాఖల కోసం పనిచేస్తున్నారు. ఈ సంస్థ ద్వారా విద్య, వైద్యం, అత్యవసర సహాయం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2005 జూన్ నుంచి 2011 మే వరకు తమిళనాడులోని శ్రీలంక శరణార్థులకు సేవలు అందించారు.
ఆ తరువాత తాలిబాన్ తీవ్రవాదుల కార్యకలాపాలతో తల్లడిల్లిపోతున్న ఆప్ఘనిస్తాన్‌కు చేరుకుని అక్కడి ప్రజలకు సేవచేసేందుకు హీరట్ అనే నగరంలో జేఆర్ఎస్ సంస్థ శాఖను నెలకొల్పారు. శోకాదద్అనే గ్రామంలోని ఒక పాఠశాలలో విద్యాబోధన కోసం ఫాదర్ అలెక్స్ వెళ్లారు. అక్కడ మూడే ళ్లనుంచి పనిచేస్తున్న దశలో గత ఏడాది జూన్ 2న తన నివాసం హీరాట్కు వెళుతుండగా ఆరుగురు తాలిబాన్ తీవ్రవాదులు చుట్టుముట్టి కిడ్నాప్ చేశారు. శివగంగైలోని ఆయన కుటుంబీకులు ఈ సమాచారం తెలుసుకుని తల్లడిల్లిపోయారు. రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించారు. ఫాదర్ కుటుంబీకులు డిల్లీ వెళ్లి విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌ను సైతం కలుసుకున్నారు.
కేంద్రం ఎంతగా ప్రయత్నించినా ఫాదర్‌ను ఎక్కడ దాచిపెట్టింది తెలియరాలేదు. అయితే ఆయన జీవించి ఉన్నట్లు మాత్రం సమాచారం అందింది. మతమార్పిడులకు పాల్పడుతున్నారనే అపోహతో తాలిబన్లు ఫాదర్‌ను కిడ్నాప్ చేశారని, ఆ తరువాత వాస్తవాలు తెలుసుకుని ఫాదర్‌కు హానితలపెట్టలేదని సమాచారం అందింది. అయినా 264 రోజులపాటూ వారివద్దనే బందీగా ఉంచుకుని రెండురోజుల క్రితం విడిచిపెట్టారు. ఆఫ్ఘనిస్తాన్లోని భారత దౌత్యాధికారులు ఫాదర్‌ను కాబూల్‌కు తెచ్చారు. అక్కడి నుంచి ఆదివారం రాత్రి 7.15 గంటలకు ఢిల్లీకి చేర్చారు. జన్మభూమిపై అడుగుపెట్టగానే సంతోషంతో ఉప్పొంగిపోయారు. తండ్రి అంతోనీరాజ్, సోదరులతో కలిసి సోమవారం సాయంత్రం ఢిల్లీ నుండి శివగంగైకి చేరుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ, తాలిబాన్ల నుంచి ప్రాణాలతో బయటపడతానని ఏమాత్రం ఊహించలేద న్నారు. తనకు పునర్జన్మ ప్రసాదించినందుకు ముందుగా భగవంతునికి నమస్కరిస్తున్నానని, ఆ తరువాత ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.