భారత్ కొత్త జెండాతో పాక్‌కు వణుకు!
అమృతసర్: భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లోని అటారీ సమీపంలో ఏర్పాటుచేసిన దేశంలోనే అత్యంత ఎత్తయిన భారత దేశ త్రివర్ణ పతాకాన్ని చూసి పాకిస్థాన్ భయపడుతోందట. ఆ జెండా ద్వారా భారత్ ఏమైనా నిఘా నిర్వహిస్తుందేమోనని పాక్ అనుమానిస్తోందట. ఈ మేరకు పాక్ భావిస్తున్నట్లు అక్కడి మీడియా చెబుతోంది.
ఇప్పటి వరకు జార్ఖండ్ రాజధాని రాంచీలో 293 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఉంది. అంతకంటే ఎత్తయిన పోల్, పెద్ద జెండా తెలంగాణలో ఎగురవేయాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు నెక్లెస్‌రోడ్డులో 300 అడుగుల ఎత్తున ఓ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కోల్‌కతాకు చెందిన స్కిప్పర్ కంపెనీ దీన్ని ఏర్పాటుచేసింది. ఇప్పుడు దానికంటే మరో 60 అడుగులు ఎక్కువ ఎత్తులో అమృతసర్‌లోని అటారీ సరిహద్ద వద్ద దాదాపు 360 అడుగుల ఎత్తులో కొత్త జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలోనే పాక్ ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ జెండాకోసం ఏర్పాటుచేసిన స్తంభం లాహోర్ నుంచి కూడా కనిపిస్తోందని, అందులో నిఘా కెమెరాలు పెట్టి తమ ప్రాంతంపై నిఘా ఏర్పాటుచేశారేమోనని పాక్ ఆందోళన వ్యక్తం చేస్తోందట. ఈ విషయాన్ని పాక్ రేంజర్లు కూడా ఇప్పటి వరకు కొట్టిపారేయలేదు. అయితే, ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని బీఎస్ఎఫ్ కొట్టిపారేసింది. అసలు నిఘా కెమెరాలే లేవని స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఒక ప్రత్యేక అనుమతి ద్వారా పంజాబ్ మంత్రి అనిల్ జోషి ఈ జెండాను ఆవిష్కరించారు. దాదాపు రూ.3.50కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు.