ఈర్ష్య నుంచి బయటపడాలి
పోటీ, ఈర్ష్యాద్వేషాల నుంచి బయట పడితేనే సంతోషం సొంతమవుతుందంటున్నారు నటి తమన్న. సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ మిల్కీ బ్యూటీ తమిళం, తెలుగు భాషలలో చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. తాజాగా దేవి చిత్రంతో మరోసారి బాలీవుడ్‌కు వెళ్లనున్న తమన్న ఇప్పుడు చాలా పరిణితి చెందారు.
ఈ విషయాన్ని ఆమె మాటలు వింటే అర్థం అవుతుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఏమంటున్నారో చూద్దామా! ‘మనసులో ఉన్నది ఎంతో కాలం దాచుకోలేం. అలాగే కష్టం వస్తే నవ్వడం సాధ్యం కాదు. నా వరకూ వస్తే నిజ జీవితంలో నటించడం నాకు తెలియదు. నేనేమనుకుంటున్నానో అది స్పష్టంగా ముఖంలో తెలిసిపోతుంది. మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం.
ప్రతి రంగంలోనూ నిత్యం ప్రతిభావంతులు వస్తూనే ఉంటారు. వారు మనల్ని వెనక్కు నెట్టి ఎదుగుతుంటారు. దీంతో ప్రతి వారిలో అభద్రతా భావం మనసుల్ని తొలిచేస్తుంది. ఈ వృత్తిలో నిలదొక్కుకోగలమా అన్న సందేహం మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఇక సినిమా రంగం విషయానికి వస్తే ఇక్కడ అందమైన ప్రతిభావంతులైన నటీమణులు చాలా మంది వస్తున్నారు. వారిని చూస్తే అసూయ పుడుతుంది.
వారు నటించిన చిత్రాలు విజయం సాధించినప్పుడు వాటిలో నటించే అవకాశం మనకు రాలేదనే బాధ కలుగుతుంది. ఇలాంటి మానసిక పరిస్థితి అయోమయానికి గురి చేసి అశాంతిని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పోటీ, ఈర్ష్యాద్వేషాల నుంచి బయట పడాలి.నేను వాటి నుంచి ఎప్పుడో బయట పడ్డాను. సినిమాలో నాకంటే అందమైన,ప్రతిభ గల నటి కచ్చితంగా ఉంటారు.
వారి ప్రతిభను అంగీకరించి గౌరవించాలి. అందుకు మనని మనం తయారు చేసుకోవాలి. అప్పుడే మంచి స్నేహితురాళ్లను సంపాదించుకోగలం. నేను ప్రతిభావంతులను స్వాగతిస్తాను. అభినందించడానికి సంకోచించను. నా కంటే బాగా నటిస్తే అసూయపడను. వెంటనే ఫోన్ చేసి అభినందిస్తాను. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా మంది స్నేహితుల్ని సంపాదించుకున్నాను’ అంటూ ముక్తాయింపునిచ్చారు.