అర్రె..ర్రె...రణ్‌బీర్ అన్నయ్యా!
ఎంతలా బ్రేకప్ అయినా ప్రేమించిన వాళ్లను బ్రదర్...సిస్టర్...అని ఎవరూ అనరు. కానీ దీపికా పదుకొనే మాత్రం రణ్‌బీర్ కపూర్‌ని పట్టుకుని ‘బ్రదర్’ అనేశారు. ఇదెప్పుడా అని అనుకుంటున్నారా? ఈ సన్నివేశం ‘తమాషా’ ట్రైలర్ విడుదల వేడుకలో జరిగింది. విషయంలోకి వెళితే... వాట్సప్, ఫేస్‌బుక్‌లలో సందేశాలు 90 రోజుల పాటు తీసేయడానికి లేదనే వార్తలు వచ్చాయి. దీని గురించి రణ్‌బీర్ కపూర్ స్పందిస్తూ- ‘‘మీకు గనక బాయ్‌ఫ్రెండ్, గాళ్‌ఫ్రెండ్ ఉంటే గనక అభ్యంతరకరమైన సందేశాలు మాత్రం పంపుకోవద్దు.
బుక్ అయిపోతారు’’ అని చెప్పారు. పక్కనే దీపికా పదుకొనే వెంటనే అతను చెప్పిన సమాధానానికి ఇంప్రెస్ అయిపోయి,‘‘ ‘శభాష్ బ్రొ’(బ్రదర్)’’ అని రణ్‌బీర్ భుజం తట్టారు. ఆ మాటతో రణబీర్ ఒక్కసారిగా షాక్ తిన్నారు.అక్కడున్న మీడియా కూడా అవాక్కయింది.