నన్నెవరూ ఆపలేరు : విశాల్
మొన్నటి నుంచి తమిళంలో నిర్మాతలకు, నిర్మాతల సంఘం ప్రతినిధులకు మధ్య వాగ్వివాదం జరుగుతోంది. ఈ సంఘంలోని సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఒకవైపు విశాల్ వర్గం కాగా నిర్మాతలు అళగప్పన్, నందగోపాల్, సురేశ్ కమాట్చి, ఆర్కే సురేశ్ తదితరులు మరో వర్గంగా ఏర్పడ్డారు. ‘‘నిర్మాతల సంఘం కోసం విశాల్ ఇచ్చిన మాట నెరవేర్చలేదు, సంఘం అభివృద్ధికి కృషి చేయడం లేదు.
విశాల్‌కు పలు పైరసీ వెబ్సైట్లతో సంబంధాలు కూడా ఉన్నాయి’’ అంటూ మరో వర్గం నిర్మాతలు ఆరోపించారు. బుధవారం నిర్మాతల మండలి ఆఫీస్‌కు తాళం కూడా వేసేశారు. గురువారం ఆ తాళం పగలగొట్టి నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా, పోలీస్‌లు ఆయన్ను అరెస్ట్ చేశారు. ‘‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు తాళం వేసినప్పుడు మౌనంగా ఉన్నారు పోలీసులు. ఇప్పుడు ఏ తప్పూ లేకపోయినా నన్ను, నా సహచరులను అరెస్ట్ చేస్తున్నారు. పోరాడతాం.
చిన్న చిన్న కారణాలకు నన్ను టార్గెట్ చేస్తున్నారు. సర్వం కోల్పోయిన నిర్మాతలకు మంచి చేద్దాం అనుకుంటున్నాను. దేవుడు, నిజం రెండూ నా వైపే ఉన్నాయి. ముందుకు అడుగు వేస్తాను. ఇళయరాజాగారి ఈవెంట్‌ను నిర్వహించకుండా నన్ను ఎవరూ ఆపలేరు’’ అని తన వాదనను ట్వీటర్ ద్వారా పంచుకున్నారు విశాల్. కాగా, వ్యతిరేక వర్గం నిర్మాతలు తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామిని కలిసి, విశాల్‌పై ఫిర్యాదు పత్రాన్ని అందించారు. అలాగే నాలుగు నెలల్లో నిర్మాతల మండలి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.