బీజేపీ మహిళా నేతకు బెదిరింపులు
తిరువొత్తియూరు: తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌కు ఫోన్లో బెదిరింపు కాల్స్ రావడంతో ఆమె ఇంటి ముందు పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. సౌందరరాజన్‌కు గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. అందులో మీ అంతు చూస్తానంటూ ఆ వ్యక్తి బెదిరింపులు ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై తమిళిసై ఆదేశాల మేరకు ఆమె న్యాయవాది తంగమణి విరుగంబాక్కం పోలీసుస్టేషన్లో రాత్రి 12 గంటలకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదుచేసిన విరుగంబాక్కం పోలీసులు విచారణ చేపట్టారు. అలాగే తమిళిసై ఇంటి ముందు పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. గోమాంసం నిషేధానికి మద్దతుగా తన భావాన్ని తెలపడంతో ఆమెకు బెదిరింపులు వచ్చినట్టు తెలియవచ్చింది. ఈ క్రమంలో ఫోన్ నంబరు ఆధారంగా బెదిరింపులు ఇచ్చిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బెదిరింపులకు భయపడను: తమిళిసై
చెన్నై నందనం వైఎంసీఏ మైదానంలో ‘రండి బలమైన భారతం వైపునకు’ అనే పేరుతో శుక్రవారం ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై మాట్లాడుతూ బెదిరింపులకు తాను భయపడనని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మోదీ ఉత్సవాలు జరుగుతున్నాయని.. 9వ తేదీన కోవైలో జరగనున్న కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విచ్చేయనున్నట్లు తెలిపారు.