గ్రూప్ రాజకీయాలపై అన్నాడీఎంకే సీరియస్
హెచ్చరించి పంపిన అధిష్టానం
హొసూరు : క్రిష్ణగిరి జిల్లాలో అధికార అన్నాడీఎంకే పార్టీలో గ్రూప్ రాజకీయాలపై అధిష్టాన వర్గం సీరియస్ అయ్యింది. క్రిష్ణగిరి మున్సిపాలిటీలో గత 28న జరిగిన మున్సిపల్ సమావేశంలో అన్నాడీఎంకే కౌన్సిలర్లు ముష్టియుద్ధానికి దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై అధిష్టాన వర్గం సూచనల మేరకు చెన్నైలో క్రమశిక్షణ కమిటీ క్రిష్ణగిరి మున్సిపల్ చైర్మన్ తంగముత్తు, వైస్ చైర్మన్ వెంకటాచలంను, అన్నాడీఎంకే కౌన్సిలర్లను సోమవారం రప్పించి చెన్నైలో విచారణ జరిపింది. ఈ సంఘటనపై ఈ రెండు వర్గాల మద్య రాతపూర్వక వివరణ కోరింది.
మున్సిపాలిటీ సమావేశంలో జరిగే సంఘటనలకు మున్సిపల్ చైర్మన్‌దే బాధ్యత అని, కౌన్సిలర్లను అనుసరించి ప్రవర్తించాలని సూచించింది. అంతే కాక పార్టీలో గ్రూపు రాజకీయాలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రులు నత్తం విశ్వనాథం, వైద్యలింగం, పళణిస్వామి, పళణియప్పన్‌లు ఇరువర్గాలను తీవ్రంగా హెచ్చరించి ఇది చివరి సారిగా ఉండాలని సూచించినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అన్నాడీఎంకే కౌన్సిలర్ తెలిపారు.