పన్నీర్ సెల్వంకు అదనపు బాధ్యతలు
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఓ పన్నీర్ సెల్వంకు అదనపు మంత్రిత్వ శాఖలు కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆయనకు ప్రణాళిక, శాసనసభా వ్యవహారాలు, ఎన్నికలు, పాస్పోర్ట్స్ శాఖలు అదనంగా అప్పగించారు. ఇంతకుముందు ఈ శాఖలను డి. జయకుమార్ నిర్వహించారు. ఆయనకు మత్స్యశాఖ, సిబ్బంది మరియు పరిపాలన సంస్కరణల శాఖ కేటాయించారు. తన వర్గాన్ని అధికారిక అన్నాడీఎంకేలో సోమవారం పన్నీర్ సెల్వం విలీనం చేశారు. దీంతో ఆయనతో పాటు కే పాండియన్‌కు మంత్రి పదవులు దక్కాయి.
నిన్న సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే డిప్యూటీ సీఎంగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయనకు ఆర్థిక, గృహ, గ్రామీణ గృహ నిర్మాణం, మురికివాడల నిర్మూలన, పట్టణాభివృద్ధి, చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ శాఖలను కేటాయించారు. పాండియన్ తమిళనాడు అధికార భాష, సంస్కృతి సంప్రదాయాల శాఖలను దక్కించుకున్నారు.