కరుణానిధితో పెద్ద కుమారుడి భేటీ
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువైన డీఎంకే మాజీ నేత ఎంకే అళగిరి గురువారం తన తండ్రి కరుణానిధిని కలిశారు. కొంతకాలంగా తండ్రికి దూరంగా ఉంటున్న ఆయన కరుణానిధిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తమ తల్లిదండ్రులను కలిసేందుకే అళగిరి వచ్చారని ఆయన సోదరుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. రాజకీయాలు, ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి విషయాలు చర్చించలేదని చెప్పారు.
స్టాలిన్ తో ఆధిపత్య పోరు కారణంగా డీఎంకేకు అళగిరి దూరమయ్యారు. అన్నాడీఎంకేకు వత్తాసు పలికి సొంత పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, డీఎంకే పొత్తుపెట్టుకోవడంపై బుధవారం మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, డీఎంకే రెండునూ ఒక రాజకీయ లక్ష్యం లేని పార్టీలని దుయ్యబట్టారు. ఎన్ని కూటమిలు ఏర్పడినా అన్నాడీఎంకేను ఏమీ చేయలేవని అళగిరి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరుణానిధితో అళగిరి భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.