రాజపక్సెను అడ్డగించిన 50మంది తమిళ భక్తుల అరెస్ట్
తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సె బుధవారం వేకువజామున 2.30 గంటల ప్రాంతంలో సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. రాజపక్సె కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు పలువురు తమిళ భక్తులు యత్నించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన లేపాక్షి సర్కిల్ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రాజపక్సెను అడ్డుకునేందుకు యత్నించిన 50మంది తమిళ భక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మంగళవారం ఆయన తన కుమారుల్లో ఇద్దరు హోహితా రాజపక్స, రోహితా రాజపక్సతో కలసి సాయంత్రం 5.35 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. ఈ సమయంలో భద్రతా కారణాల రీత్యా టీటీడీ అంగ ప్రదక్షిణం రద్దు చేసింది. తిరుమలలోని విజయబ్యాంకులో కరెంట్ బుకింగ్‌లో ఇచ్చే సుప్రభాత సేవా టికెట్లను కూడా రద్దు చేశారు. రాజపక్స పర్యటన తిరుపతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తమిళనాడు నుంచి 500 మంది ఎండీఎంకే, వీసీకే పార్టీల కార్యకర్తలు తిరుపతికి చేరుకున్నారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బందోబస్తుతో రెండ్రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.