బాహుబలికి రూ.27 కోట్లు
భారతీయ, సినిమానే కాదు ప్రపంచ సినిమా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం బాహుమలి. మగధీరతో వారెవ్వా అనిపించుకుని, అల్పప్రాణి ఈగతో తెరపై అద్భుతాలు ఆవిష్కరించిన టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ దర్శకుడు రాజమౌళి తాజాబ్రహ్మాండ సృష్టి బాహుబలి. ప్రభాస్, రానా, కన్నడ నటుడు సుదీప్, సత్యరాజ్, నాజర్, అనుష్క, తమన్న, రమ్యకృష్ణ వంటి పలువురు ప్రతిభావంతులైన తారాగణంతో నిండిన ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా వెండితెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
బాహుబలి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలతో పాటు ఇతర దేశాలలోను భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్క తమిళంలో మాత్రమే బాహుబలి 27 కోట్లు అమ్ముడు పోయిందని సమాచారం. తమిళంలో సూర్యతో సింగం, సీక్వెల్‌తోపాటు పలు విజయవంతమైన చిత్రాలను అదే విధంగా కార్తీతో పలు భారీ చిత్రాలను నిర్మించిన స్టూడియో గ్రీన్సంస్థ అధినేత కెఇ జ్ఞానవేల్ రాజ్ బాహుబలి హక్కులను సొంతం చేసుకోవడం విశేషం.
ఈ విషయాన్ని జ్ఞానవేల్ రాజా స్పష్టం చేస్తూ బాహుబలి చిత్ర తమిళ హక్కులను తాను యువి క్రియేషన్స్‌తో కలిసి అత్యధిక మొత్తం వెచ్చించి పొందినట్లు తెలిపారు. ఈ చిత్రంలోని 45 నిమిషాల సన్నివేశాలను తాను చూశానన్నారు. బాహుబలి తమిళనాడులోను అద్భుత విజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందని పేర్కొన్నారు. అందుకే అంత పెద్ద మొత్తంతో చిత్ర తమిళనాడు విడుదల హక్కులను కొనుగోలు చేసినట్లు చెప్పారు. బాహుబలి హిందీ హక్కులను ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.