ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లతోనే ప్రగతి సాధ్యం
డిసెంబరులో దేశవ్యాప్త ఉద్యమం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అడిగే హక్కు ప్రజలకు ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభద్రం అన్నారు. ఈ ప్రక్రియ అమలైతేనే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను తీసుకురావాలని కోరారు. శనివారం జిల్లాకేంద్రంలోని రెడ్‌క్రాస్ భవన్లో ‘ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ.. ప్రైవేట్‌రంగాల్లో రిజర్వేషన్ల సాధన కోసం దీర్ఘకాలిక పోరాటాలు చేయాల్సి ఉందని, అందుకు సీపీఎం సిద్ధంగా ఉందన్నారు. అందుకోసం డిసెంబర్లో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. దేశంలో 1902లోనే సాహు మహారాజ్ మహారాష్ట్రలో రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితోనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచారని పేర్కొన్నారు.
‘ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ల సాధన’పై ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రిజర్వేషన్లు ఉంటే ప్రతిభ ఉండదనే వాదన సరికాదన్నారు. పెట్టుబడిదారుల వెనుక కష్టజీవుల శ్రమ దాగి ఉందన్నారు. ప్రభుత్వ సహాయం తీసుకుని కంపెనీలు, ప్రైవేట్రంగాలను స్థాపిస్తున్నారని అన్నారు. హిందూ మతోన్మాదం వల్లే దేశంలో కులవ్యవస్థ వచ్చిందన్నారు. నేడు మతోన్మాదశక్తులే అధికారంలోకి వచ్చాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు జాన్‌వెస్లీ, కిల్లె గోపాల్, ఎ.రాములు, కురుమూర్తి, చంద్రకాంత్, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.