క్రీడల అభివృద్ధికి కృషి
పరిగి: క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని పరిగి ఎమ్మెల్యే తమ్మన్నగారి రామ్మోహన్‌రెడ్డి (టీఆర్ఆర్) అన్నారు. బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక మినీస్టేడియంలో జోనల్ స్థాయి క్రీడాకారుల ఎంపికలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో క్రీడాకారులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు అండగా ఉంటానన్నారు.
మోడల్ స్కూళ్లు, ఇండోర్ స్టేడియాలు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడతానని తెలిపారు. ఈ ప్రాంత విద్యార్థులెవరైనా ఇంజినీరింగ్ చదవాలనుకుంటే తమ కళాశాలల్లో ఉచితంగా సీట్లు ఇస్తానని తెలిపారు. పరిగి నంబర్- 1 ఉన్నత పాఠశాలకు క్రీడా సామగ్రి కోసం టీఆర్ఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ. 20వేలు అందజేస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జోనల్ సెక్రటరీ భాస్కర్‌రెడ్డి, జీహెచ్ఎంలు గోపాల్, రాములు, పీడీలు గాంగ్యానాయక్, సునీత, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం మాజీ అధ్యక్షుడు రాములు, నాయకులు నారాయణ్‌రెడ్డి, ఎర్రగడ్డపల్లి కృష్ణ, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.