తంగిరాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా: బాబు
నందిగామ : టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు భౌతిక కాయానికి ఆపార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. చంద్రబాబు సోమవారం ఉదయం తంగిరాల భౌతిక కాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తంగిరాల మృతి పార్టీకి కృష్ణాజిల్లా ప్రజలకు తీరని లోటు అన్నారు. తంగిరాల మృతిని తాను జీర్ణించుకోలేక పోతున్నట్లు ఆయన తెలిపారు. క్రియాశీల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తంగిరాల పార్టీకి ఎనలేని సేవ చేశారన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు తంగిరాల కృషి చేశారని చంద్రబాబు ప్రశంసించారు. నిజాయితీకి తంగిరాల మారుపేరుగా నిలిచారన్నారు.
కాగా ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. రాత్రి 11.30 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు వెంటనే మదర్‌థెరిస్సా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 12 సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. టీడీపీ ప్రారంభం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న ప్రభాకర్ 2009లో తొలిసారిగా నందిగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన ఆయన న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.