నిన్న గండి.. నేడు పైపులు
గండి కొట్టిన చెరువుకు అనుమతి లేకుండా పైపులు
టీడీపీ నాయకుడి ఇష్టారాజ్యం
విస్తుపోతున్న ఆయకట్టు రైతులు
నీరు చెట్టు పనుల కోసం బరితెగించారని ఆరోపణలు
సమృద్ధిగా నీరు ఉన్న సాగు నీటి చెరువుకు బుధవారం అక్రమంగా గండి కొట్టిన టీడీపీ నాయకులు గురువారం మరింత బరితెగించారు. ఎవరి అనుమతీ లేకుండానే పైపులు కూడా వేసే పని ప్రారంభించారు. ఈ చెరువులో నీరు చెట్టు పథకం కింద పనులు చేపట్టి నిధులు కాజేసేందుకే గండి కొట్టి విలువైన సాగునీటిని వృథా చేశారని, మిగిలి ఉన్న నీటిని కూడా బయటకు పంపేందుకే పైపులు వేస్తున్నారని ఆయకట్టు రైతులు చెబుతున్నారు.
చోడవరం: ఇరిగేషన్ అధికారుల అనుమతి లేకుండానే వెంకన్నపాలెం సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఉన్న కాశీవిశ్వేశ్వర సాగునీటి చెరువుకు గండికొట్టిన అధికార పార్టీ నాయకుడు గురువారం ఏకంగా పైపులు వేశాడు. ఈ సంఘటన అందరిలో చర్చనీయాంశమైంది. ఎవరికి నచ్చినట్టు వారు చెరువులకు గండికొట్టేసి వారికి నచ్చినట్టు పనులు చేసుకుంటే ప్రభుత్వ శాఖలు, అధికారులు ఎందుకో టీడీపీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే చెప్పాలని రైతులు అంటున్నారు. కాశీవిశ్వేశ్వర చెరువుకు గండి కొట్టడం, దిగువ ఆయకట్టు పంట భూములు మునిగిపోయిన విషయం ‘సాక్షి’లో వెలువడిన విషయం తెలిసిందే. ఈ చెరువుకు గండికొట్టిన విషయం గాని, చేస్తున్న పనులు గాని తమకు తెలియవని, అనుమతికూడాలేదని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. అసలు గండి ఎందుకు కొట్టినట్టు, పైపులైన్లు ఎందుకు వేస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల అనుమతి, పర్యవేక్షణ లేకుండా ఇక్కడ టీడీపీ నాయకులు ఎందుకు ఈ దుశ్చర్యకు దిగారనే విషయమే ఇప్పుడు ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. నీరుచెట్టు పనులకు చెరువులో నీటిని ఖాళీ చేయడానికే ఇదంతా చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. చెరువు గట్టుకు గండికొట్టడమేకాకుండా ఇటీవల రూ.5 లక్షల జెడ్పీ నిధులతో ఈ చెరువుకు గట్టుకు సిమెంట్ లైనింగ్‌తో గోడ నిర్మించి, గట్టును పటిష్టం చేయగా ఆ గోడను కూడా కొంత కూలదోసి మరీ గట్టుకు గండికొట్టడం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమేనని అధికారులు అంటున్నారు. అధికారపార్టీ నాయకుడు ఎవరి అండదండలతో ఇందతా చేస్తున్నారో, దీనిపై ఇరిగేషన్ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలని ప్రజలు అంటున్నారు.