జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ అరెస్ట్.. బెయిల్
కేబుల్ నెట్వర్క్ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
జగ్గయ్యపేట అర్బన్: నిబంధనలను అతిక్రమించి ప్రసారాలు చేస్తున్నారన్న అభియోగంపై శ్రీసాయిసూర్య డిజిటల్ కేబుల్ నెట్వర్క్ యాజమాన్య ప్రతినిధి, మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావును పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 12.30 సమయంలో మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్లో ఉన్న తన్నీరును సీఐ వై.వి.వి.ఎల్.నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. సన్నెట్ వర్క్ ప్రతినిధి జి.సంగమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 420 ఐపీసీ సెక్షన్ 51,63,65 కాపీరైట్ యాక్ట్ కింద తన్నీరును అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
అనంతరం తన్నీరును కోర్టుకు తరలించిన పోలీసులు.. అక్కడ హాజరుపర్చకుండా సంతకం చేయాలంటూ తిరిగి స్టేషన్‌కు తీసుకొచ్చారు. రెండు గంటలు తరువాత మళ్లీ కోర్టుకు తీసుకెళ్లారు. పొద్దుపోయిన తరువాత తన్నీరుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై ఆయన విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా పోలీసులు తన్నీరును అరెస్టు చేశారని ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ బి.శ్రీనివాసులు తీర్పులో పేర్కొన్నారు.అరెస్ట్ సమాచారంతో వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ధర్నా చేశాయి.