కొత్త లుక్‌తో తారాపోర్వాలా అక్వేరియం
సాక్షి, ముంబై: నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటైన తారాపోర్వాలా మత్స్యాలయం (ఫిష్ అక్వేరియం) కొత్త హంగులతో శుక్రవారం నుంచి సందర్శకులకు కనువిందు చేయనుంది. చర్నీరోడ్ చౌపాటీకి సమీపంలో ఉన్న ఈ అక్వేర్యాన్ని నవీకరణ పనుల కోసం 2013 మార్చి నుంచి మూసివేశారు. ఇప్పుడు కొత్త హంగులతో, వివిధ రకాల దేశ, విదేశాలకు చెందిన దాదాపు 110 రకాల చేపలతో రూపుదిద్దుకున్న ఈ అక్వేర్యాన్ని సందర్శకుల కోసం ఈ నెల 27 నుంచి పునఃప్రారంభించనున్నారు. అయితే టికెటు చార్జీలు మాత్రం భారీగా పెంచారు. కొత్త చార్జీల్లో విద్యార్థులకు, వృద్థులకు, వికలాంగులకు సైతం ఎలాంటి రాయితీలు కల్పించలేదు.
ఈ అక్వేర్యంలో మొబైల్, కెమెరా ద్వారా వీడియో షూటింగ్ చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. అయితే ఎవరైనా దేశ, విదేశీ పర్యాటకులు వీడియో షూటింగ్ చేయాలనుకుంటే రూ.500 నుంచి రూ.10,000 (కెమెరాను బట్టి) వరకు చెల్లించాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా వీడియో చిత్రీకరణ పనులు చేపడితే అందుకు రూ.రెండు వేలు జరిమానా విధించడంతోపాటు షూటింగ్ చేసిన మొబైల్ లేదా కెమెరాను జప్తు చేస్తారు. ఈ మత్స్యాలయాన్ని 2-జీ, 3-జీ స్థాయిలో ఆధునికీకరించారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు రూ.40, ప్రభుత్వ ఉద్యోగులకు రూ.30, విదేశీ పర్యాటకులకు (పెద్దలకు) రూ.200, 12 ఏళ్ల లోపు పిల్లలకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
నియమ, నిబంధనలు
వీడియో షూటింగ్ చేసే సమయంలో మత్స్యాలయ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా, చేపలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిష్ ట్యాంకులో చేతుల పెట్టడం, వాటి పక్కన నిలిచి ఫొటోలకు ఫోజ్ ఇవ్వడం లాంటివి చేయకూడదు. కెమెరా ఫ్లాష్ వాడకూడదు. ప్రొఫెషనల్, స్టిల్ కెమెరాతో షూటింగ్ చేయాలనుకునేవారు వారం రోజుల ముందు అనుమతి తీసుకోవాలి.
చార్జీల వివరాలిలా ఉన్నాయి...
వర్గాలు పాత (రూ.) కొత్త (రూ.)
3-12 ఏళ్ల లోపు పిల్లలకు 10 30
12 ఏళ్ల పైబడిన వారికి 15 60
వికలాంగులకు ఉచితం 30
వీడియో షూటింగ్ చార్జీలు (రూ.లలో)
మొబైల్ ఫోన్‌తో 500
వీడియో కెమెరా, డిజిటల్ కెమెరా 1,000
ప్రొఫెషనల్ స్టిల్ కెమెరా 5,000
ప్రొఫెషనల్ షూటింగ్ 10,000