బాగ్దాద్‌లో బాంబు పేలుళ్లు: 27 మంది మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో నిన్న చోటు చేసుకున్న వేర్వేరు బాంబు దాడులు, కాల్పుల ఘటనల్లో మొత్తం 27 మంది మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు. మరో 70 మంది గాయపడ్డారని, క్షతగాత్రులు బాగ్దాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బాగ్దాద్‌లో నిన్న రాత్రి జరిగిన బాంబు పేలుళ్లలో 15 మంది మరణించారు. వారిలో సింహభాగం సైనికులే అని చెప్పారు. అందులో 45 మంది గాయపడ్డారన్నారు.
అలాగే సున్నీ అరబ్ పట్టణంలో తర్మియ ప్రాంతంలో ఇరాక్ ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి చేసిందని వివరించారు. ఆ ఘటన రాత్రి 10.30 గంటలకు చోటు చేసుకుందని తెలిపారు. అలాగే గురువారం ఉదయం బాంబు పేలుళ్లు, వేర్వేరు కాల్పుల ఘటనలో 12 మంది మరణించగా, 23 మంది గాయపడ్డారు.
అయితే ఇరాక్‌లో బాంబుపేలుళ్లు, ఆత్మాహుతి దాడులు నిత్యకృత్యం కావడం పట్ల యూఎస్ అసిస్టెంట్స్ మిషన్ ఫర్ ఇరాక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి గత నెల అక్టోబర్ వరకు 7వేల మంది మృత్యువాత పడ్డారని, అలాగే 16 వేల మంది గాయడ్డారని గణాంకాలతో సహా సోదాహరణగా యూఎస్ అసిస్టెంట్స్ మిషన్ ఫర్ ఇరాక్ వివరించింది.