ఆ బ్లాక్‌మెయిల్‌పై అశ్వినీ ఏం చేసిందంటే
కేవలం 12 గంటల సమయంలోనే 26 ఏళ్ల తరుణ అశ్వనీ జీవితం ఊహించని మలుపులు తిరిగింది. అనేక కుదుపులకు లోనుచేసింది. తరుణ బలహీనురాలైతే లొంగిపోయేదేమో! నిస్సహాయ స్థితిలో ఏదైనా అఘాయిత్యం చేసుకొనేదేమో.. కానీ తరుణ లొంగిపోలేదు. ఎదురుతిరిగింది. పోరాటానికి సిద్ధపడింది. ఇప్పుడు తరుణ సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. అసలు ఏం జరిగిందంటే..
గత శుక్రవారం రాత్రి 8.59 గంటలకు ముంబైకి చెందిన తరుణ అశ్వనీకి ఓ ఈమెయిల్ వచ్చింది. ‘నా దగ్గర నీ నగ్న ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. వీటిని బయటపెట్టకుండా ఉండాలంటే నువ్వు నన్ను తృప్తి పరచాలి. నేను చెప్పినట్టు నగ్నంగా ఫొటోలు, వీడియోలు పంపించాలి’ అని బ్లాక్మెయిల్ చేస్తూ అతను అశ్వినికి మెయిల్ పంపాడు. ఆ తర్వాత కాసేపటికే తనవి ఉత్త బెదిరింపులు కాదని హెచ్చరించడానికి ఆమె నగ్నఫొటోలను కూడా పంపి మరింత భయపెట్టాలని చూశాడు. ఆ వికృత వ్యక్తి బెదిరింపులకు ఆమె లొంగలేదు. అతనికి భయపడి బిక్కుబిక్కుమంటూ గడపలేదు. వెంటనే ఈ బెదిరింపులను బహిరంగపరచాలని ఆమె నిర్ణయించింది. అతని రెండు ఈయిళ్లను స్ర్కీన్‌షాట్స్ తీసి ఆమె తన ఫేస్బుక్ పేజీలో పెట్టింది. తన గూగుల్ అకౌంట్‌ను హ్యాక్ చేసి అందులో తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు దొంగలించి.. వాటితో బెదిరించాలని చూస్తున్నాడని, కానీ, అతని బెదిరింపులకు లొంగకుండా.. ఈ విషయాన్ని బయటపెట్టాలని నిర్ణయించినట్టు ఆమె తన పోస్టులో పెట్టారు. తాను ఇలా చేయడం వల్ల ఇలాంటి బెదిరింపుల బారిన పడిన మహిళల భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చేందుకు ప్రేరణగా ఉంటుందని భావిస్తున్నట్టు ఆమె చెప్పారు.
సైబర్ నేరగాడి బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా.. కొంతమంది అలాంటి ఫొటోలను ఎందుకు నీ బాయ్‌ఫ్రెండ్‌కు పంపావని ప్రశ్నిస్తున్నారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తరుణ ఈ విమర్శలను కొట్టిపారేసింది. ఆమె ప్రియుడు, పోలాండ్ జాతీయుడైన స్టాస్ ఈస్ట్కో కూడా ఈ విమర్శలను తప్పుబట్టారు.
’భారతీయ సంప్రదాయవాదులు తరుణను తప్పుబడుతున్నారు. తమ భాగస్వామికి అలాంటి ఫొటోలు తీసి పంపడాన్ని తప్పుబడుతున్నారు. కానీ పాశ్చాత్య దేశాల్లో ఇలాంటివి అసహజం ఏమీ కాదు. ఇద్దరు యుక్త వయస్కులు పరస్పర సమ్మతితో చేసుకొనే ఇలాంటివి వ్యక్తిగత ప్రైవసీలోభాగంగా చూడాలి’ అని ఆయన చెప్పారు. ఇక ముంబైకి చెందిన తరుణ గత ఐదు నెలలుగా అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉంటూ.. ఫిజికల్ థెరపీ నిపుణురాలిగా కొనసాగుతోంది. తనకు ఆన్లైన్ బెదిరింపులు రావడంపై అమెరికాలోని మేరీల్యాండ్ పోలీసులు, ఎఫ్‌బీఐ దృష్టికి తీసుకెళ్లినా.. వారు స్పందించలేదు. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ సెల్ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.