టాటా గ్రూప్ : రూ.6 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకూ భిన్న రకాల ఉత్పత్తులను అందించే దిగ్గజ గ్రూప్ ‘టాటా’... రూ. 6 లక్షల కోట్ల మార్కెట్ విలువకు చేరువైంది. తద్వారా తొలిసారి ఈ ఘనత సాధించిన దేశీయ గ్రూప్‌గా రికార్డు సృష్టించనుంది. గ్రూప్‌లో మొత్తం 100 కంపెనీలుండగా, 32 మాత్రమే స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసేసరికి గ్రూప్‌లోని మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 5.90 లక్షల కోట్లకు చేరింది. ఇందుకు ప్రధానంగా గ్రూప్‌లోని సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ చేయందించింది. ఓవైపు స్టాక్ మార్కెట్లు నష్టాలతో విలవిల్లాడుతున్నప్పటికీ టీసీఎస్ షేరు ఏడాది కాలంలో 50%కు మించి దూసుకెళ్లింది.
దీంతో టీసీఎస్ మార్కెట్ విలువ దాదాపు రూ. 4 లక్షల కోట్లకు చేరింది! వెరసి ఈ స్థాయి విలువను సాధించిన రెండో దేశీయ కంపెనీగా నిలిచింది. గతంలో ముకేశ్ అంబానీ గ్రూప్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే ఈ కిరీటాన్ని అందుకుంది. కాగా, ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న ఆర్ఐఎల్తో కూడిన ముకేశ్ అంబానీ గ్రూప్ విలువ కేవలం రూ. 2.75 లక్షల కోట్లకు పరిమితంకావడం గమనార్హం. ఇక మూడో ర్యాంక్‌లో నిలుస్తున్న కుమార మంగళం బిర్లా గ్రూప్ మార్కెట్ విలువ రూ. 1.5 లక్షల కోట్లుగా నమోదైంది.
మార్కెట్లకు ఎదురీదుతూ: గత మూడు నెలల్లో స్టాక్ మార్కెట్ల విలువ 10% క్షీణించగా, టాటా గ్రూప్ విలువ 15%(రూ. 80,000 కోట్లు) పుంజుకోవడం చెప్పుకోదగ్గ అంశం! గ్రూప్‌లోని మిగిలిన ప్రధాన దిగ్గజాల మార్కెట్ విలువ ఇలా ఉంది. టాటా మోటార్స్ విలువ రూ. 90,000 కోట్లుకాగా, టాటా స్టీల్ రూ. 27,000 కోట్లు, టైటన్ ఇండస్ట్రీస్ రూ. 20,000 కోట్లు, టాటా గ్లోబల్ బెవరేజెస్ మార్కెట్ క్యాప్ రూ. 8,600 కోట్లు. గ్రూప్‌లో ఇంకా టాటా పవర్, ఇండియన్ హోటల్స్, టాటా కమ్యూనికేషన్స్, ర్యాలీస్ ఇండియా, టాటా కాఫీ, వోల్టాస్,
టాటా కెమికల్స్ తదితరాలున్నాయి. గ్రూప్ మొత్తంలో ఒక్క టీసీఎస్ విలువే దాదాపు ముప్పావు వంతు కావడం విశేషం. స్టాక్ ఎక్స్ఛేంజీలలో 2004 ఆగస్ట్ 25న టీసీఎస్ లిస్టయ్యాక టాటా గ్రూప్ విలువ తొలిసారి రూ. లక్ష కోట్లను అధిగమించింది. అప్పటికి లిస్టెడ్ కంపెనీల సంఖ్య 28గా ఉంది. 1991లో 18 లిస్టెడ్ కంపెనీలతో టాటా గ్రూప్ విలువ రూ.8,000 కోట్లే. గ్రూప్ మార్కెట్ విలువలో అప్పటికి టాటా స్టీల్‌దే అగ్రస్థానం!