టేక్ టూ అనేది ఆయన డిక్షనరీలోనే లేదు!
ఎస్వీఆర్... పేరు తలచుకోగానే మనసు పులకించిపోతుంది!
ఆయనను కలిసిన తొలి క్షణం...
పెరిగిన పరిచయం... ఏర్పడిన అనుబంధం...
ఇలా అన్నీ నా మనసులో సజీవంగా నిలిచిపోయాయి!
తొలిసారి కలిసింది అక్కడే...
ఆ రోజు... మద్రాసులోని వాణీమహల్లో ‘పద్మశ్రీ’ నాటక ప్రదర్శన.
రచయితనూ నేనే... దర్శకుణ్ణి నేనే... హీరోని కూడా నేనే!
హాలు మొత్తం నిండిపోయింది!
నాటకం పూర్తికాగానే ఒకటే కరతాళ ధ్వనులు!
వీటన్నిటి కన్నా, ఒక వ్యక్తి ప్రశంసలు నాలో ఉద్వేగాన్ని రేకెత్తించాయి.
‘‘వెల్డన్! నాటకం చాలా బాగా రాశావ్. ముఖ్యంగా నీ నటనలో చాలా ఈజ్ ఉంది. ఎక్కడా బిగుసుకుపోకుండా సునాయాసంగా నటించావు. రైటర్‌గా, ఆర్టిస్టుగా నీకు మంచి భవిష్యత్తు ఉంది.’’
ఈ మాటలన్నది ఓ మామూలు వ్యక్తి కాదు...
మహానటుడు... అభినయ మేరునగధీరుడు... ఎస్వీ రంగారావు!
నా గురువు కేవీ నందనరావు ఆహ్వానిస్తే ఆ నాటకాన్ని వీక్షించడానికి వచ్చారు ఎస్వీఆర్. అలా ‘పద్మశ్రీ’ నాటకంతో ఆయనతో పరిచయ భాగ్యం కలిగింది. ఆ తర్వాత అనుకోకుండా రెండు మూడు పెళ్లి వేడుకల్లో కలిశాం. కలిసినప్పుడల్లా నన్ను గుర్తుపట్టి పలకరించేవారు.
అలా మొదలైంది మా సాన్నిహిత్యం...
ఇదిలా ఉండగా ఆయన ప్రధానపాత్ర పోషించిన జగత్ కిలాడీలు’ సినిమాకు డైలాగ్‌లు రాసే అవకాశం నాకు వచ్చింది.
దుర్యోధనుడు, భీముడు లాంటి రకరకాలు పౌరాణిక పాత్రలు చేసిన ఆయనను మెక్సికన్ డ్రెస్‌లో చూడటం గమ్మత్తుగా అనిపించింది.
ఆ తర్వాత ‘జగత్‌జెట్టీలు’...
ఈ చిత్రానికి నేనే స్క్రీన్‌ప్లే, మాటలు రాశా. సెట్లో ఉంటూ అసోసియేట్ డెరైక్టర్లా పని చేశా. ఇందులో కూడా ఎస్వీఆర్‌ది లీడ్ రోల్. ఈ క్రమంలో ఆయనతో నా సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఎస్వీఆర్ డెరైక్ట్ చేసిన ‘బాంధవ్యాలు’, ‘చదరంగం’ చిత్రాలకు నా గురువు కేవీ నందన్‌రావు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్. ఆయన ద్వారా నేను కూడా ఆ సినిమాలకు పని చేస్తూ, కొంత మేరకు స్క్రిప్టు వర్కులో పాలుపంచుకున్నా. ఎస్వీఆర్‌కి నా పనితీరు నచ్చింది. నన్నొక ఆత్మీయుడిలా చూసుకునేవారు. ఆయన ఇంటికి అప్పుడప్పుడూ వెళ్లి కాసేపు గడిపి వస్తుండేవాణ్ణి.
మొదట ఆయనకే కథ చెప్పా...
ఈ క్రమంలో ఓసారి ఆయనతో సూచాయగా ఒక కథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. నేను దర్శకుడు కావడం కోసం నిర్మాతలకు కథలు వినిపించే ప్రయత్నంలో ఉన్నాను. కృష్ణతో ‘బందిపోటు భీమన్న’ (1969) తీసిన దోనేపూడి బ్రహ్మయ్యకు ఓ సెంటిమెంట్ కథ వినిపించాను. అది ఎస్వీఆర్‌కి చెప్పిన కథే. కానీ బ్రహ్మయ్యకు క్రైమ్ సినిమా చేయాలని ఉంది. అందుకే ఆ కథ వద్దన్నారు. మరో వైపు నిర్మాత కె. రాఘవను కలిశాను. ఆయన కూడా క్రైమ్ కథే కావాలన్నారు. కొన్ని చర్చలు కూడా జరిగాయి.
ఎస్వీఆర్, కె. రాఘవ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్లిద్దరి మాటల్లో నా ప్రస్తావన వస్తే, అతని దగ్గర మంచి సెంటిమెంట్ కథ ఉందని ఎస్వీఆర్ చెప్పారట. వెంటనే కె. రాఘవ నన్ను పిలిపించి కథ చెప్పమన్నారు. ఆయనక్కూడా విపరీతంగా నచ్చేసింది. అదే ‘తాత-మనవడు’! అందులో ఎస్వీఆర్‌ది రైతు రంగయ్య పాత్ర. సినిమాకు వెన్నెముకలాంటి పాత్ర. ఆయన లేకుండా సినిమాను అస్సలు ఊహించలేం!
అలిగి వెళ్లిపోయారు...
ఇక నా రెండో సినిమా ‘సంసారం-సాగరం’. ఇందులో ఎస్వీఆర్‌ది కాబూలీ వాలా పాత్ర. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఈ సినిమా షూటింగ్లో ఎస్వీఆర్‌తో చిన్న ఎపిసోడ్ జరిగింది...
1973 జూలై 21న మద్రాసులోని విక్రమ స్టూడియోలో షూటింగ్ మొదలు పెట్టాం. ఆరోజు ఫార్మల్గా రెండు, మూడు షాట్స్ తీశాం.
మరుసటిరోజు క్లైమాక్స్ తీయాలని ప్లాన్ చేశాం.
జూలై 22 ఆదివారం... సెట్లో 20 మంది ఆర్టిస్టులున్నారు. తొలి షాట్ కైకాల సత్యనారాయణ, జయంతిపై తీశాం.
రెండో షాట్ ఎస్వీఆర్, జయంతిపై తీయాలి.
నా అసోసియేట్ అంజిబాబుని ఎస్వీఆర్‌కి డైలాగ్ చెప్పమని పంపించాను. ఆయన ఆ డైలాగులన్నీ విని ‘‘ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చాలు’’ అని కొన్ని డైలాగులు తగ్గించేశారు. ‘ఆ రెండు డైలాగులూ తీసేస్తే, క్లైమాక్స్ చాలా దెబ్బ తింటుంది’ అని ఆయన దగ్గరకు వెళ్లి కన్విన్స్ చేయబోయాను. అయినా వినలేదు. ‘‘సార్... సినిమాలో మీరు నటిస్తున్న తొలి సీన్ ఇది. కానీ ఆర్డర్లో ఇది 99వ సీన్. 98 సీన్లు రాశాక నేను సీన్ రాశాను. ఈ సీన్ ఎలా ఉంటే బావుంటుందో టీమ్ అంతా చర్చించుకున్నాకనే డైలాగులు రాశాను’’ అని వివరించాను. దాంతో ఆయనకు కోపం వచ్చేసింది. విసురుగా బయటకు వెళ్లిపోయారు. కోపం తగ్గాక వస్తారని చాలాసేపు ఎదురు చూశాం. అయినా రాలేదు. ఆయనను బతిమిలాడి తీసుకురమ్మని కె. రాఘవకు చెప్పాను. ‘‘నేను క్లోజ్ ఫ్రెండ్‌ని కదా. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పాలి కానీ, అలా వెళ్ళిపోతే ఎలా? ఏం పర్లేదు... రావు గోపాలరావుని పిలిపిద్దాం. ఆ వేషం అతనితో వేయిద్దాం’’ అని రాఘవ అప్పటికప్పుడు రావుగోపాలరావుకి కబురంపారు. రావు గోపాలరావు వచ్చి మేకప్ రూమ్‌లోకి వెళ్లేసరికి అక్కడ ఎస్వీఆర్ ఉన్నారు. ఈయన ఖంగుతిని ‘‘ఊరికే... మిమ్మల్ని కలుద్దామని వచ్చానండి’’ అని చెప్పి వెళ్లిపోయారు. ఎస్వీఆర్‌కి విషయం అర్థమై రాఘవని పిలిచి చనువుతో తిట్టారు. తర్వాత ఆ సీన్ నేను చెప్పినట్టుగానే యాక్ట్ చేశారు. ఆ తర్వాత నేను ఆయన దగ్గరకు వెళ్ళి ‘‘సారీ సార్... మీ మనసు నొప్పించాను. నాది మొండితనం కాదు. రషెష్ వచ్చాక మీకు చూపిస్తాను. అప్పుడు కూడా ఆ డైలాగులు వద్దంటే తీసేస్తాను’’ అని చెప్పాను. ఆయన కదిలిపోయి ‘‘నారాయణరావ్... నిన్ను చూసి గర్వపడుతున్నానయ్యా. డైరక్టర్ అంటే ఇలాగే ఉండాలి. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ పరిశ్రమను శాసించే స్థాయికి ఎదుగుతావు... కీపిటప్’’ అని నా భుజం తట్టారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఇంకా క్లోజ్‌నెస్ పెరిగిపోయింది!
ఇంతలో విషాదం..!
1974 జూలై 18...
మద్రాసులో వేరే సినిమా షూటింగ్లో ఉన్నాను.
ఎవరో వచ్చి వార్త చెప్పగానే నాకు కాస్సేపు గుండె ఆగిపోయినట్టుగా అనిపించింది!
షూటింగ్‌కి పేకప్ చెప్పేసి, వెంటనే ఎస్వీఆర్ ఇంటికి బయలుదేరాం. సింహం లాంటి మనిషి... అలా నిర్జీవంగా కనబడేసరికి, ఇక మళ్లీ కనబడరనే సరికి ఏడుపొచ్చేసింది. దుఃఖం ఆపుకోవడం నావల్ల కాలేదు! అంత్యక్రియలు పూర్తయ్యేవరకూ అక్కడే ఉన్నా. ఇంటికి వచ్చాక కూడా ఆయన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన్ను బేస్ చేసుకుని ఇంకో 10 సినిమా కథలు తయారు చేసుకున్నా. అవన్నీ ఇప్పుడు అనాథలేనా? ఇంత గొప్ప నటుడితో కేవలం రెండే సినిమాలు చేసే అదృష్టం దక్కిందా నాకు? ఇలా ఏవేవో నాలో ఆలోచనలు ముప్పిరిగొన్నాయి.
నో రీప్లేస్మెంట్..!
నాకు తెలిసి ఎస్వీఆర్‌కి ఎలాంటి శారీరక సమస్యలు లేవు. చివరి క్షణం వరకూ అదే విగ్రహం, అదే ఠీవి! ఏమైనా చిన్నా చితకా కుటుంబ సమస్యలుండేవేమో... అది కూడా నాకు పెద్దగా తెలీదు. ఎందుకో అప్పుడప్పుడూ డిస్ట్రబ్డ్‌గా మాత్రం అనిపించేవారు.
ఎస్వీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్టు అని నేను కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వనవసరం లేదు. ఇది ప్రపంచమంతా ఒప్పుకునే మాట. టేక్ టూ అనేది ఆయన డిక్షనరీలోనే లేదు! ఓ విద్యార్థిలాగా డైలాగ్ పేపర్ శ్రద్ధగా చదివేవారు. అలాంటి ఆర్టిస్టుని మళ్లీ చూడలేం.
ఎస్వీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే - ఆయన నటప్రపూర్ణుడు. చాలామంది తాము ఎస్వీఆర్ అంతటి నటులమని ఫీలైపోతుంటారు కానీ, ఎస్వీఆర్‌కి నో రీప్లేస్మెంట్! అంతటి నటుడు ఇక రారు... రాబోరు!
ఆయనకు తగ్గ గుర్తింపు రాలేదన్నది వాస్తవమే!
ఆయన ప్రతిభకు తగిన గుర్తింపు, పురస్కారాలు రాలేదన్న వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది. అందుకు చాలా కారణాలున్నాయి. అసలు అవార్డుల ఎంపికకు చిత్రాలు పంపించాలన్న విషయంలో అప్పట్లో చాలామందికి చైతన్యం లేదు. ఎస్వీ రంగారావు, సావిత్రి, అంజలీదేవి, గుమ్మడి... ఇంతటి గొప్ప వాళ్లకి ‘పద్మ’ పురస్కారాలు దక్కకపోవడానికి కారణం ఏంటంటే... అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసులో ఉండేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ల వివరాలు పూర్తిగా తెలీదు. అక్కడివాళ్లకేమో మనం పరాయివాళ్లం. వాళ్లేమో తమిళ పరిశ్రమకు చెందిన వాళ్లను రికమెండ్ చేసుకునేవారు. ఈ రకంగా కొంతకాలం గడిచిపోయింది. అయినా అవార్డులు రానంత మాత్రాన ఎస్వీఆర్ తక్కువ అయిపోరుగా?!
భావితరాలకు ఆయనొక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్..!
ఎస్వీఆర్... ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కిందే లెక్క! ఆయన సినిమాలు చూసి భావితరం నటులు ఎన్నో నేర్చుకోవచ్చు. పాత్రకు తగ్గ ఆహార్యం, పాత్రకు తగ్గ మాడ్యులేషన్, వీటన్నిటితో పాటు డైలాగ్స్ లేని చోట ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో... ఇవన్నీ ఆయన నటన చూసి నేర్చేసుకోవచ్చు!
- సంభాషణ: పులగం చిన్నారాయణ