నాకు సపోర్టు ఇవ్వండి ప్లీజ్ : మిస్త్రీ
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీపై గ్రూప్ కంపెనీలు కూడా వేటువేస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీల చైర్మన్‌గా బోర్డు సభ్యుడిగా ఆయన్ని పీకేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైరస్ మిస్త్రీ ఇక షేర్‌హోల్డర్స్ మద్దతుపై దృష్టిసారించారు. టాటా పవర్ బోర్డు నుంచి తనను పీకేయకుండా ఉండేందుకు వారి మద్దతును కోరారు. బోర్డు నుంచి తనను వైదొలగించే ప్రతిపాదనను వ్యతిరేకించాలని అభ్యర్థిస్తూ ఆయన షేర్హోల్డర్స్కు ఓ లేఖ రాశారు.
తన కాలంలో టాటా పవర్, పోటీదారులకంటే మెరుగైన ప్రదర్శనను కనబరిచిందని మిస్త్రీ ఆ లేఖలో పేర్కొన్నారు. గత మూడేళ్లలో ఈబీఐటీడీఏలు మెరుగుపడ్డాయని, దేశీయ పవర్ సెక్టార్లో కంపెనీకి పునఃరేటింగ్ కల్పించానని చెప్పారు. 2006లో మిస్త్రీ సన్స్ బోర్డులో చేరారు. తర్వాత 2012 డిసెంబర్లో బోర్డు చైర్మన్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన టాటా పవర్ చైర్మన్‌గా ఉన్నారు. కాగ, సైరస్ మిస్త్రీని బోర్డు నుంచి తొలగించడానికి టాటా పవర్ కంపెనీ 2016 డిసెంబర్ 26న అసాధారణ జనరల్ మీటింగ్ నిర్వహిస్తోంది. ఈ భేటీలో సైరస్ మిస్త్రీని బోర్డు నుంచి వైదొలగించే ప్రతిపాదనను తీసుకొస్తోంది.