Tata Power Company Ltd
-
ఒక్క నిర్ణయం.. ఈవీ ఛార్జింగ్ సమస్యలకు చెక్!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది, పెరుగుతున్న వాహనాలకు కావలసినన్ని 'ఛార్జింగ్ స్టేషన్స్' మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ (TPEVCSL).. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా పవర్ అనుబంధ సంస్థ TPEVCSL దేశంలో ఛార్జింగ్ స్టేషన్స్ సంఖ్యను పెంచడానికి IOCLతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండూ కలిసి దేశవ్యాప్తంగా సుమారు 500 కంటే ఎక్కువ హైస్పీడ్, అల్ట్రా-ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేయనున్నాయి. త్వరలో ఇన్స్టాల్ చేయనున్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే, కొచ్చి వంటి ప్రధాన నగరాల్లో మాత్రమే కాకుండా.. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే, సేలం-కొచ్చి హైవే, గుంటూరు-చెన్నై హైవే వంటి ప్రధాన రహదారులపై ఉన్న 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్' అవుట్లెట్లలో ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో లాంగ్ జర్నీ చేయాలనుకునే వారికి ఈ కొత్త ఛార్జింగ్ స్టేషన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయని, 'టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్' యాప్ ద్వారా లేదా 'ఇండియన్ ఆయిల్ ఈ-ఛార్జ్' మొబైల్ యాప్ ద్వారా ఛార్జింగ్ స్టేషన్స్ గురించి సమాచారం తెలుసుకోవచ్చని టాటా పవర్ బిజినెస్ డెవలప్మెంట్-ఈవీ చార్జింగ్ హెడ్ వీరేంద్ర గోయల్ తెలిపారు. ఇదీ చదవండి: కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా? ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి పెరుగుతున్న సమయంలో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 6000 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నట్లు, వీటి సంఖ్యను 2024 నాటికి 10000 చేర్చడానికి కంపెనీ కృషి చేస్తున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సమస్యలు దాదాపు తొలగిపోతాయని స్పష్టంగా తెలుస్తోంది. -
టాటా కంపెనీపై సైబర్ దాడి కలకలం
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ సంస్థ టాటా పవర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మౌలిక సదుపాయాలు .. సైబర్ దాడికి గురయ్యాయి. దీంతో కొన్ని ఐటీ సిస్టమ్స్‌పై ప్రభావం పడిందని స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది. సిస్టమ్స్‌ను పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించింది. కీలకమైన అన్ని సిస్టమ్‌లు యథాప్రకారం పని చేస్తున్నాయని, అయితే ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగులు, కస్టమర్లు వినియోగించే పోర్టల్స్, టచ్ పాయింట్లపై కొన్ని పరిమితులు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. -
ఫార్మా షేర్ల కి డిమాండ్
దేశీ స్టాక్స్‌లో ఎఫ్ఐఐల కొనుగోళ్లు కొనసాగడంతోపాటు, ఫార్మా దిగ్గజాలకు డిమాండ్ పెరగడంతో సెంటిమెంట్ బలపడింది. దీంతో వారం ఆరంభంలోనే సెన్సెక్స్ 111 పాయింట్లు లాభపడి 20,811 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ కూడా 36 పాయింట్లు పుంజుకుని 6,186 వద్ద ముగిసింది. ఫార్మా షేర్లు క్యాడిలా హెల్త్, ర్యాన్‌బాక్సీ, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, గ్లెన్‌మార్క్ 5-2% మధ్య ఎగశాయి. వెరసి డాక్టర్ రెడ్డీస్(రూ. 2,795), లుపిన్(రూ. 956), క్యాడిలా(రూ. 995) చరిత్రాత్మక గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. గత వారం రూ. 2,500 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. రూ. 267 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్స్ యథాప్రకారం రూ. 249 కోట్ల విలువైన అమ్మకాలను చేపట్టాయి. ఎన్టీపీసీ డౌన్, టాటా పవర్ అప్ కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ(సీఈఆర్సీ) విద్యుత్ టారిఫ్‌లకు సంబంధించి కొత్తగా ప్రకటించిన నిబంధనల కారణంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ బీఎస్ఈలో 11%పైగా పతనమై రూ. 117 వద్ద ముగిసింది. ఇది 52 వారాల కనిష్టంకాగా, రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి దాదాపు 3.5 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఉత్పత్తినిబట్టి కాకుండా అమ్మకపుస్థాయి(ఆఫ్టేక్) ఆధారంగా టారిఫ్ నిర్ణయంకానుండం ఇందుకు కారణమైంది. అయితే ముంద్రా ప్రాజెక్ట్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్‌పై నష్టపరిహారంకింద యూనిట్‌కు రూ. 50 పైసలను అదనంగా వసూలు చేసుకునేందుకు సీఈఆర్సీ అంగీకరించడంతో టాటా పవర్ 5% జంప్‌చేసి రూ. 83 వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్ల దూకుడు న్యూయార్క్: అమెరికా స్టాక్ మార్కెట్లు జోరుమీదున్నాయి. కేటర్పిల్లర్, మెర్క్ అండ్ కంపెనీ వంటి దిగ్గజాలు ఏడాది గరిష్టానికి చేరడంతో ఎస్అండ్పీ-500 సూచీ చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకింది. ఇంతక్రితం జనవరి 15న సాధించిన 1,848 పాయింట్ల లైఫ్‌టైమ్ హైను అధిగమించి 1,857 వద్ద కదులుతోంది. ఇక నాస్డాక్ 14 ఏళ్ళ గరిష్టమైన 4,309కు చేరగా, డోజోన్స్ 184 పాయింట్లు ఎగసి 16,287 వద్ద ట్రేడవుతోంది.