శిక్ష ఇద్దరికీ...
బుద్ధుడు అంతా శూన్యం అని అంటే ఆదిశంకరులు అంతా సంపూర్ణం అని చెప్పుకొచ్చారు. అలాగే చైనా జ్ఞాని లావోత్సు తత్వాలు కూడా సామాన్యమైనవి కావు. లావోత్సు కీర్తిప్రతిష్టల గురించి తెలిసి చైనా చక్రవర్తి ఓరోజు తన సభకు పిలిపించి ఆయనను ప్రధానమంత్రిని చేయాలనుకున్న విషయాన్ని చెప్తాడు. లావోత్సు సున్నితంగా తిరస్కరిస్తాడు.
‘‘అయ్యా, పరిపాలనకు సంబంధించి నాకున్న అభిప్రాయాలు వేరు. మీరు ఇప్పటికే రాసి ఉన్న చట్టాల ప్రకారం నడచుకుంటారు. కానీ నేను నా మనస్సాక్షికి తగినట్లే ప్రవర్తిస్తాను’’ అని లావోత్సు అంటాడు. కానీ చక్రవర్తి ఆయనపై ఒత్తిడి తీసుకొస్తాడు. ధర్మబద్ధమైన పాలన కొనసాగడానికి మీలాంటి వారు మా మంత్రి మండలిలో ఉండాలి’’ అని అంటాడు. కాదనలేక ప్రధానమంత్రి పదవి చేపడతాడు లావోత్సు.
తొలిరోజే ఒక నేరం విచారణకు వస్తుంది. ఒక దొంగ ఓ ప్రముఖుడి ఇంట దొంగతనం చేసి పట్టుబడతాడు. అతనిని తీసుకొచ్చి రాజు ముందు హాజరుపరుస్తారు.
అతను ఎక్కడైతే దొంగతనం చేశాడో ఆ ఇంటి యజమానిని కూడా సభకు రప్పిస్తారు. ఇంటి యజమాని తన ఇంట చోరీ చేసింది అతనే అని చెప్తాడు. దొంగ కూడా అవునని ఒప్పుకుంటాడు. ఇద్దరి మాటలు విన్న లావోత్సు దొంగకు ఆరు నెలలు, ఇంటి యజమానికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్తాడు. ఆయన చెప్పిన తీర్పు విని చక్రవర్తి, సభలోని ఇతర మంత్రులు విస్తుపోతారు. ఇంటి యజమాని ‘‘నాకెందుకు శిక్ష వే శారు. నేను చేసిన త ప్పేంటో తెలియడం లేదు’’ అని లబోదిబోమంటాడు. అప్పుడు లావోత్సు ‘‘దొంగతనానికి ప్రేరేపించింది నువ్వే. అది నీ తప్పు. అతను పేదరికం కారణంగా దొంగతనం చేశాడు. నువ్వు ఇతరుల శ్రమను దోచుకుని సంపాదించిన డబ్బును దాచుకున్నావు. నిజానికి నీకు మరింత ఎక్కువ కాలం జైలు శిక్ష విధించాల్సింది’’ అంటాడు లావోత్సు. ఆ తర్వాత ఇంటి యజమాని చక్రవర్తిని కలిసి ‘‘రాజా, ఈ మనిషి విచిత్రంగా ఉన్నాడు.
ఇటువంటి వ్యక్తులను మీ ఆస్థానంలో మంత్రులుగా నియమించడం సరికాదు. ఈరోజు నాకు పట్టిన గతే రేపు మీకు కూడా ఎదురు కావచ్చు. పేదల రక్తాన్ని దోచుకుని మీరు డబ్బునంతా ఖజానాలో దాచుకున్నారని మిమ్మల్ని కూడా ఖైదు చేయించే అవకాశం లేక పోలేదు. నాకు తోచిందేదో మీకు చెప్పాను. ఆపై మీ ఇష్టం’’ అని చెప్తాడు. ఈ మాటలకు చక్రవర్తి ఆలోచనలో పడతాడు. ఎందుకైనా మంచిదని లావోత్సుని పదవి నుంచి తప్పిస్తాడు.
నేరం జరిగే కారణాలను తెలుసుకుని ఆ పరిస్థితులను మార్చకుండా కేవలం తప్పుచేసిన వారికి మాత్రమే శిక్ష విధిస్తే దాని వల్ల ఫలితం ఉండదని, నేరస్తుల సంఖ్యను తగ్గించలేమని లావోత్సు నిశ్చితాభిప్రాయం. లావోత్సు ఆభిప్రాయం చైనాలో అనేక మందిని ఆలోచనలో పడేసింది. తర్వాతి కాలంలో ఆయన అభిప్రాయాలు ‘తావ్ త జింగ్’ అనే పేరుతో పుస్తకంగా వెలువడ్డాయి. ఈ పుస్తకాన్ని ఇరవైకి పైగా భాషలలోకి అనువదించారు కూడా. ‘తావ్ త జింగ్’ అంటే జ్ఞానం, మంచి జీవితం అని అర్థం. శాస్త్రాభివృద్ధి అంతగా లేని రోజుల్లో చెప్పిన లావోత్సు అభిప్రాయాలు అప్పటికే కాదు ఇప్పటికీ ఎప్పటికీ ఆచర ణీయమే.