Tax income
-
జీఎస్టీకి ఐదేళ్లు పూర్తి
న్యూఢిల్లీ: వాణిజ్య పన్నుల ఎగవేతలకు నివారించడం, దేశవ్యాప్తంగా ఒకటే పన్ను విధానం ఉండాలన్న లక్ష్యాలతో వచ్చిందే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)చట్టం. దేశ చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్టీ 2017 జూలై 1న అమల్లోకి రాగా, ఈ ఏడాది జూన్ 30తో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న నూతన పన్ను వ్యవస్థ అనుకున్న లక్ష్యం దిశగా నిదానంగా అడుగులు వేస్తోంది. గతంతో పోలిస్తే పన్ను ఎగవేతలు తగ్గాయి. టెక్నాలజీ సాయంతో ఎగవేతలను గుర్తించడం యంత్రాంగానికి సాధ్యపడుతోంది. ప్రతీ నెలా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం సగటున రూ.1.3 లక్షల కోట్లపైనే ఉంటోంది. 17 రకాల పన్నులు, పలు సెస్సుల స్థానంలో వచ్చిందే జీఎస్టీ. ఇందులో 5, 12, 18, 28 రేట్ల శ్లాబులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వీటికి భిన్నంగా బంగారం ఒక్కదానిపై 3 శాతం రేటు అమలవుతోంది. గతంలో అయితే అన్నింటిపైనా వినియోగదారుల చెల్లించే సగటు పన్ను సుమారు 31 శాతంగా ఉండేది. లగర్జీ వస్తువులు, ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించే వాటిపై జీఎస్టీ కింద అదనంగా సెస్సు అమల్లో ఉంది. ఈ రూపంలో వచ్చిన మొత్తాన్ని ప్రత్యేకంగా పరిహార నిధి పేరుతో కేంద్రం నిర్వహిస్తోంది. జీఎస్టీ కారణంగా పన్ను ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్రాలకు ఈ సెస్సు నిధి నుంచి పరిహారాన్ని కేంద్రం చెల్లిస్తోంది. 2022 ఏప్రిల్ నెలకు వసూలైన రూ.1.68 లక్షల కోట్లు.. జీఎస్టీ చరిత్రలో గరిష్ట నెలవారీ పన్నుల ఆదాయంగా ఉంది. జీఎస్టీ కింద మొదటిసారి రూ.లక్ష కోట్ల పన్ను ఆదాయం 2018 ఏప్రిల్ నెలకు నమోదైంది. కరోనా కారణంగా 2020 ఏప్రిల్, మే నెలలకు పన్ను ఆదాయం గణనీయంగా పడిపోవడం గమనార్హం. శ్లాబుల క్రమబద్ధీకరణ మరోవైపు జీఎస్టీ శ్లాబులను క్రమబద్ధీకరించే ప్రతిపాదన కూడా ఉంది. 5 శాతం రేటును ఎత్తివేసి అందులోని వస్తు, సేవలను 8 శాతం శ్లాబులోకి తీసుకెళ్లాలన్నది ఒకటి. 12, 18 శాతం పన్ను రేట్లలో ఒకదాన్ని ఎత్తివేయడం కూడా పరిశీలనలో ఉంది. అలాగే, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, లిక్కర్లను కూడా జీఎస్టీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్ సైతం ఉంది. కాకపోతే రాష్ట్రాలకు అధిక ఆదాయం వీటి రూపంలో వస్తున్నందున ఈ ప్రతిపాదనకు అవి సుముఖంగా లేవు. జీఎస్టీ వ్యవస్థ అమలును చూడడం, పన్ను రేట్ల సమీక్ష, ఇతర అంశాలను జీఎస్టీ కౌన్సిల్ చూస్తుంటుంది. ఇప్పటి వరకు జీఎస్టీ కౌన్సిల్ 47 విడతలుగా భేటీ అయింది. ఎన్నో ఉత్పత్తులు ఇప్పటి వరకు రేట్ల సవరణకు గురయ్యాయి. టెక్నాలజీతో లీకులకు చెక్ జీఎస్టీ యంత్రాగానికి కావాల్సిన సాంకేతిక సహకారాన్ని జీఎస్టీ నెట్వర్క్ అందిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో డేటాను విశ్లేషించడం ద్వారా, ఎగవేతలు, లీకేజీలకు అడ్డుకట్ట వేస్తోంది. మరింత సులభంగా ఉండాలి.. ఈ ఐదేళ్లలో జీఎస్టీ చట్టం కొంత పురోగతి సాధించినప్పటికీ.. పన్ను అంశాల పరంగా మరింత సరళంగా మారాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అన్నది మొత్తం సరఫరా చైన్‌లో ఎటువంటి నష్టాల్లేకుండా, సాఫీగా సాగేందుకు జీఎస్టీ నిర్మాణం మరింత సరళంగా మారాలన్నది పన్ను నిపుణుల నుంచి వినిపిస్తున్న మాట. ‘‘గత ఐదేళ్లలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు సకాలంలో వివరణలు, సవరణల చేయడం ద్వారా జీఎస్టీ చట్టం అభివృద్ధి చెందింది. అయినప్పటికీ అవాంఛనీయ షోకాజు నోటీసులను నివారించే దిశగా జీఎస్టీ కౌన్సిల్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బలమైన, టెక్నాలజీతో కూడిన ఏకీకృత అసెస్మెంట్ కార్యక్రమం ఉండాలి’’అని బీడీవో ఇండియా పార్టనర్ జీ ప్రభాకరన్ పేర్కొన్నారు. ‘‘వివాదాలను తగ్గించాల్సి ఉంది. ఇందుకు అస్పష్టమైన నిబంధనలను మార్చాలి. బీపీవో/కేపీవో ఇంటర్మీడియరీకి అర్హత సాధిస్తాయా, భవనాలకు సంబంధించి చేసే మూలధన నిధులపై పన్ను జమ, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ పై జీఎస్టీ లెవీ ఇలా వివిధ రంగాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించాలని వ్యాపారులు కోరుకుంటున్నారు’’అని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ తెలిపారు. అలాగే, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ లను కూడా జీఎస్టీ కిందకు తీసుకొస్తే కంపెనీలకు వ్యయాలు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
5 నెలలు.. 5 వేల కోట్ల లోటు
సాక్షి, హైదరాబాద్: కరోనా విపత్తు నుంచి రాష్ట్ర ఖజానా కోలుకుంటోంది కానీ...పన్ను ఆదాయం మరింత మెరుగవ్వాలని గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టు వరకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో మొత్తం రూ.5వేల కోట్ల లోటు ఏర్పడింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించిన వివరాల ప్రకారం 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి వచ్చిన పన్ను ఆదాయం రూ. 25 వేల కోట్లు మాత్రమే. అదే 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి రూ.30వేల కోట్లు పన్నుల రూపేణా వచ్చాయి. ఈ ఏడాది రూ. లక్ష కోట్లకు పైగా పన్ను ఆదాయం వస్తుందని రాష్ట్ర వార్షిక బడ్జెట్లో అంచనా వేశారు. అందులో ఇప్పటిదాకా కేవలం 24.66 శాతం మాత్రమే వచ్చింది. అదే గత ఏడాది వార్షిక బడ్జెట్ అంచనాలో ఆగస్టు నాటికి రూ.36.78 శాతం పన్ను ఆదాయం సమకూరడం గమనార్హం. జూన్ నుంచి కోలుకుని.. ఈ ఏడాది పన్ను ఆదాయం గణాంకాలను పరిశీలిస్తే తొలి రెండు నెలలు కలిపి వచ్చింది కేవలం రూ.5,382 కోట్లే. అదే గత ఏడాది చూస్తే... తొలి మాసం (ఏప్రిల్)లోనే రూ. 5,226 కోట్ల రాబడి వచ్చింది. కరోనా దెబ్బకు తొలి రెండు నెలలు విలవిల్లాడిన రాష్ట్ర ఖజానా జూన్ నుంచి కోలుకుంటోంది. అయితే, జూన్ నుంచి ఆగస్టు వరకు వరుసగా మూడు మాసాల్లోనూ దాదాపు ఒకే విధంగా పన్నుల ద్వారా ఆదాయం లభించింది. జూన్‌లో రూ. 6,510 కోట్లు, జూలైలో రూ. 6,588 కోట్లు, ఆగస్టులో రూ.6,677 కోట్లు పన్నుల రూపేణా రాష్ట్ర ఖజానాకు చేరాయి. అంటే ఈ మూడు నెలల్లోనే రూ.20వేల కోట్ల వరకు వచ్చాయన్నమాట. ఆర్థిక సంవత్సరం ఇప్పటికే ఐదు నెలలు ముగిసిన నేపథ్యంలో ఇదే ఒరవడి కొనసాగితే తప్ప రెవెన్యూ పద్దు సజావుగా సాగే పరిస్థితి ఉండదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అలా వచ్చినా మరో రూ.46వేల కోట్ల వరకు వచ్చే మొత్తంతో కలిపి ఏడాది పన్నుల రాబడి రూ.71 వేల కోట్ల వరకు మాత్రమే వస్తుందని, మొత్తం బడ్జెట్ అంచనాల్లో అది 70 శాతమే ఉంటుందని అంటున్నారు. అదే గత ఏడాది వార్షిక బడ్జెట్ అంచనాలో పన్నుల ద్వారా రూ. రూ.89,047 కోట్లు వస్తాయని పేర్కొనగా, అందులో 93.87 శాతం అంటే రూ. 83,904 కోట్లు వచ్చాయి. బడ్జెట్ అంచనాల్లో కేవలం రూ.6వేల కోట్లు మాత్రమే తక్కువ రావడం గమనార్హం. కానీ, ఈ ఏడాది ఎక్కువలో ఎక్కువగా 75 శాతానికి మించే పరిస్థితి కనిపించడం లేదు. అప్పుల తిప్పలు తప్పనట్టే పన్నుల రాబడి చక్రం ఈసారి ఏమాత్రం పట్టు తప్పినా రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. గత మూడు నెలలుగా వస్తున్న రాబడులు కొనసాగితే ఇతర మార్గాల్లో కూడా కొన్ని నిధులు సమకూర్చుకుని నెట్టుకురాగలం కానీ.. ఈ ఆదాయంలో ఎక్కడ తేడా వచ్చినా అప్పుల కుప్ప పేరుకుపోతుందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే రూ.24వేల కోట్లకు పైగా అప్పులు తీసుకురావాల్సి వచ్చిందని, అదే గత ఏడాది మొత్తానికీ కలిపి తెచ్చిన అప్పులు రూ.29వేల కోట్లేనని ఆ శాఖ అధికారులు అంటున్నారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.20వేల కోట్లు అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా అప్పులను తగ్గిస్తోంది. తొలి రెండు నెలల్లోనే రూ.13వేల కోట్లను రుణాల ద్వారా సమీకరించగా, ఆ తర్వాతి మూడు నెలలు తగ్గించింది. ఈ రుణ సమీకరణ రానున్న మూడు నెలల్లో మరింత తగ్గుతుందని, ఆ మేరకు పన్నుల ఆదాయం సమకూరుతుందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా సిమెంటు
పన్ను ఆదాయంకోల్పోతున్న తెలుగు రాష్ట్రాలు * రోజుకు 6,000 టన్నుల సిమెంటు రాక హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొందరు సిమెంటు వ్యాపారుల కారణంగా తెలుగు రాష్ట్రాలు పన్ను ఆదాయాన్ని కోల్పోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దు జిల్లాలకు పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి సిమెంటు అక్రమంగా రవాణా అవుతోంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. గత కొంత కాలంగా ఈ తంతు జరుగుతోందని తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌కు, ఒడిశా నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు, అలాగే ఛత్తీస్‌గఢ్ నుంచి ఖమ్మంకు సిమెంటు రవాణా అవుతోంది. వివిధ రాష్ట్రాల్లో సిమెంటు ధరల తారతమ్యం ఉంది. దీనికితోడు తెలుగు రాష్ట్రాల్లో సిమెంటు దిగుమతిపై ఎంట్రీ ట్యాక్స్ లేకపోవడంతో వ్యాపారులు అదనుగా తీసుకుంటున్నారు. నెలకు రూ. 18 కోట్లు.. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒరిస్సా నుంచి రోజుకు సుమారు 6 వేల టన్నుల సిమెంటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు దిగుమతి అవుతోందని సమాచారం. పొరుగు రాష్ట్రాల్లో అమ్మకాలు నమోదు కావడంతో ఆ మేరకు తెలుగు రాష్ట్రాలకు ఆదాయం రాకుండా పోతోంది. సిమెంటుపై వ్యాట్ 14.5% ఉంది. అంటే ఒక్కో బస్తాపై వ్యాట్ సుమారు రూ.45-50లు అవుతుంది. రోజుకు 6 వేల టన్నుల సిమెంటు దిగుమతి అవుతోందంటే ఈ లెక్కన నెలకు రూ.18 కోట్ల పన్ను ఆదాయాన్ని రెండు రాష్ట్రాలు చేజార్చుకుంటున్నాయి. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక వ్యాపారికి సిమెంటు పంపాలంటే అక్కడి ప్రభుత్వ వెబ్సైట్ ఇ-సుగమ్ ద్వారానే లావాదేవీలు జరపాల్సిందే. ఈ విధానంతో ఆ వ్యాపారి నుంచి కర్ణాటక ప్రభుత్వానికి వ్యాట్ ఖచ్చితంగా వస్తుంది. ఇటువంటి వ్యవస్థ ఇక్కడ లేకపోవడంతో తెలుగు రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్నాయి’ అని ఒక ప్రముఖ కంపెనీ ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.