రెవెన్యూ సెక్రటరీ పోస్టు రద్దు చేయాలి
ఆర్థిక మంత్రికి టార్క్ తొలి నివేదిక
న్యూఢిల్లీ: రెవెన్యూ కార్యదర్శి పోస్టు రద్దు... సీబీడీటీ, సీబీఈసీల విలీనం... పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) వినియోగాన్ని విస్తృతపర్చడం... ఇవీ, పన్ను వ్యవస్థ సంస్కరణల కమిషన్(టార్క్) చేసిన కొన్ని సిఫార్సులు. పార్థసారథి షోమ్ సారథ్యంలోని టార్క్ తన తొలి నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అందజేసింది. పన్ను చట్టాలకు పాత తేదీ నుంచి సవరణల అమలుకు స్వస్తిపలకాలని కోరింది. ఆదాయ పన్ను రిటర్నుల్లో సంపద పన్ను వివరాలు కూడా ఉండాలని సూచించింది.
ఈ నివేదికలోని కొన్ని సిఫార్సులు...
* నిర్ణీతకాలంలో ట్యాక్స్ రిఫండ్ల కోసం బడ్జెట్ కేటాయింపులుండాలి. టీడీఎస్ కోసం పాస్‌బుక్ స్కీమును ప్రవేశపెట్టాలి.
* మెరుగైన పన్నుల వ్యవస్థ కోసం సీబీడీటీ, సీబీసీఈల్లో ఎంపిక చేసిన విభాగాలు వెంటనే విలీనం కావాలి. మరో ఐదేళ్లలో ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు ఉమ్మడి బోర్డుతో సీబీడీటీ, సీబీసీఈలు ఏకీకృత యాజమాన్యం దిశగా సాగాలి.
* కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, ఈపీఎఫ్ఓ వంటి ప్రభుత్వ విభాగాలకు సైతం ఉపయోగపడే విధంగా పాన్‌ను కామన్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్ (సీబీఐఎన్)గా మార్చాలి.
* ఒకే విభాగం పరిధిలో ఉండే సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్సులకు సింగిల్ రిజిస్ట్రేషన్ అమలు.
* సంపద పన్ను రిటర్నులను విడిగా దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఐటీ రిటర్నుల్లోనే వెల్త్ ట్యాక్స్ రిటర్నులను కలపాలి. ట్యాక్స్ రిఫండ్లను నిర్ణీత కాలంలోపు కచ్చితంగా జారీచేయాలి.