రైలు రద్దయిందని, డ్రాప్ చేస్తానని తీసుకెళ్లి..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఎర్రకోటకు సమీపంలోని పార్క్ వద్ద 23 ఏళ్ల మహిళపై ఓ ట్యాక్సీ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. లుధియానకు చెందిన ఓ మహిళ నోయిడాలోని తన సోదరుడి ఇంటికి వచ్చింది. తిరిగి లుధియానాకు వెళ్లేందుకు సోమవారం రాత్రి ఓ రైలు టికెట్ తీసుకొంది. రైలు మంగళవారం తెల్లవారు జామున 4.30కు ఉండటంతో ఆమె అక్కడే రెండుగంటల వరకు ఓ వెయిటింగ్ హాల్లో రైలు కోసం కూర్చుంది.
అయితే, అటువైపు వచ్చిన చున్ను కుమార్ అనే వ్యక్తి రైలు రద్దయిందని అబద్ధం చెప్పి, తాను బస్ స్టాండులో డ్రాప్ చేస్తానని, అక్కడి నుంచి బస్సులో వెళ్లొచ్చని నమ్మబలికించి తీసుకెళ్లాడు. సరిగ్గా ఎర్రకోటకు సమీపంలోని గోల్డెన్ జుబిలీ పార్క్ వద్దకు వెళ్లగానే బెదిరించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి అనంతరం రైల్వేస్టేషన్ వద్ద విడిచిపెట్టి పరారయ్యాడు. ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు శాస్త్రి పార్క్ ప్రాంతానికి చెందిన అతడిని అరెస్టు చేశారు.