కరువు సహాయక చర్యలేవీ?
అనంతపురం రూరల్: ‘అనంత’ కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం అనంతపురం కార్యాలయాన్ని ముట్టడించారు. నాయకులు, కార్యకర్తలు ప్లేటులో రాళ్లు పెట్టుకుని వినూత్న తరహాలో నిరసన తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు, కూలీలు పొట్టచేత పట్టుకుని తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వలసపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా జిల్లాలోని 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడమే తప్ప ఎటువంటి సహాయక చర్యలూ చేపట్టడం లేదని మండిపడ్డారు. హంద్రీనీవా ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి జిల్లాకు నికరంగా 100 టీఎంసీల నీటిని కేటాయించాలని, ఉపాధి హామీ పథకం కింద ఏడాదిలో 200 పనిదినాలు కల్పించి, రోజుకూలి రూ.400 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జిల్లాలోని విద్యార్థులకు అన్ని రకాల ఫీజులూ రద్దు చేసి కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని కోరారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సీపీఐ నేతలను అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సొంతపూచికత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు జాఫర్, నారాయణస్వామి, రైతు సంఘం నాయకులు చిరుతల మల్లికార్జున, కాటమయ్య, కేశవరెడ్డి, గోపాల్, రామకృష్ణ, రమేష్, అల్లీపీరా, పద్మావతి, నారాయణస్వామి, జాన్సన్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.