తేనీటీ తోటల్లో...
ఈ నెల 15న టీ డే
తేయాకు తోటల స్వర్గం... డార్జిలింగ్! భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన హిల్‌స్టేషన్ డార్జిలింగ్! ఈ ప్రాంతం చుట్టూ ఎటు చూసినా అబ్బురపరిచే తేయాకుతోటల సౌందర్యం కళ్లారా చూసి తీరాల్సిందే!
సందర్శన కోసం: ‘హ్యాపీ వ్యాలీ టీ ఎస్టేట్’ డార్జిలింగ్ ఉత్తర పట్టణం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో 1854లో ఆంగ్లేయులు తేయాకు తోటల పెంపకం చేపట్టారు. ఆ తర్వాత కలకత్తాలోని ధనికులైన కొంతమంది ఈ తోటల పెంపకాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. సముద్రమట్టానికి 2,750 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్ద టీ గార్డెన్. మంగళవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు ఈ తేయాకు తోటల సందర్శనకు వెళ్లవచ్చు.ఎప్పుడు వెళ్లవచ్చంటే: జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు అధికం కాబట్టి ఈ మాసాలలో ఈ ప్రాంతానికి వెళ్లకపోవడమే మంచిది. మార్చ్ నుంచి నవంబర్ వరకు తేయాకు సేకరణలో మునిగిపోతారు. కాబట్టి ఈ మాసాలు అనుకూలం.
తేయాకు తోటలకు రాజధాని... అస్సాం...
మన దేశంలోని ఉత్తర ఈశాన్యంలో మారుమూల ప్రాంతంలో ఉన్న అస్సాం తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి బ్రహ్మపుత్ర లోయలో అతి విస్తారమైన తేయాకు తోటలు ఉన్నాయి. అస్సాంలో ముఖ్య ప్రాంతమైన జొర్హాట్ లోయ మధ్య ప్రాంతాన్ని ‘ప్రపంచపు తేయాకు తోటలకు రాజధాని’గా అభివర్ణిస్తారు.
సందర్శన కోసం: జొర్హ్హాట్కు దగ్గరలో గల గటూంగా టీ ఎస్టేట్‌కు చేరుకోవాలి. ఈ ప్రాంతంలో 100 ఏళ్లుగా పర్యాటకుల కోసం గెస్ట్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడ వసతి సదుపాయాలు పొందుతూనే తేయాకు తోటల పెంపకాన్ని వీక్షించవచ్చు. ఇక్కడి తేయాకు పరిశ్రమలో టీ పొడులు ఎలా తయారవుతున్నదీ తెలుసుకోవచ్చు.
ఎప్పుడు వెళ్లవచ్చంటే: మే నుంచి జూన్ చివరి వరకు ఇక్కడి తేయాకు తోటల సందర్శనకు మంచి అనువైన కాలం. డిసెంబర్ మొదటి వారం నుంచి ఇక్కడ తోయాకు తోటల పెంపకాన్ని మొదలుపెడతారు. ప్రతి యేటా నవంబర్‌లో జొర్హాట్‌లో ‘తేయాకు ఉత్సవం’ జరుపుతారు.
మది దోచే తేనీటి పరిమళం... మున్నార్...
భూతల స్వర్గంగా అంతా అభివర్ణించే రాష్ట్రం కేరళలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం మున్నార్! మైళ్ల కొద్ది విస్తారంగా ఉండే ఇక్కడి తేయాకు తోటల వీక్షణకు పర్యాటకులు అధికంగా వెంచేస్తుంటారు.
సందర్శన కోసం: మున్నార్‌లోని ‘నల్లతన్ని ఎస్టేట్ టీ మ్యూజియమ్’ అత్యద్భుతమైనదిగా పేరుగాంచింది. సోమవారం మినహా మిగతా అన్ని రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎస్టేట్‌ను సందర్శించవచ్చు. కుండలే టీ ప్లాంటేషన్ చుట్టూ అందమైన సరస్సు, రిసార్టులు ఉన్నాయి.ఎప్పుడు వెళ్లవచ్చంటే: ఆగస్టు నుంచి మే వరకు మంచి అనువైన సమయం. డిసెంబర్ నుంచి జనవరి చివరి వరకు ఇక్కడ చలి చాలా ఎక్కువ.
నిగారింపైన తోటలు... నీలగిరి పర్వతాలు...
దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో నీలగిరి పర్వతశ్రేణులు దట్టమైన తేయాకు తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ సువాసనభరితమైన తేయాకు తోటల పెంపకానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. సందర్శన కోసం: ఇక్కడి సిమ్స్ పార్క్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ‘హై ఫీల్డ్ టీ ఫ్యాక్టరీ’ ఉంది. ఇది కూనూర్‌లోని అత్యద్భుతమైన తేయాకు పరిశ్రమగా పేరొందింది. ఇక్కడ ఇళ్లలో తయారు చేసిన తేయాకు పొడులు లభిస్తాయి. ‘తేయాకు గూడు’ అనే పేరు పొందిన ‘సింగర టీ ఎస్టేట్’ కూనూరులోనే ఉంది. నీలగిరి పర్వతశ్రేణులలోని తేయాకు తోటలను వీక్షించడానికి ఇక్కడ టాయ్ ట్రైన్ సౌలభ్యం ఉంది. కోయంబత్తూరు నుంచి కూనూర్ వెళ్లి, తిరిగి కోయంబత్తూరు చేరుకోవచ్చు. ఎప్పుడు వెళ్లవచ్చంటే: నీలగిరిలో సంవత్సరం పొడవునా తేయాకు తోటల పెంపకం ఉంటుంది. మంచి తేయాకు కావాలనుకుంటే మాత్రం చలికాలం (నవంబర్ నుంచి ఫిబ్రవరి) అనువైన సమయం.
తేయాకు దేశం... వయనాడ్
కొండలపై వ్యవసాయానికే కాదు తేయాకు తోటలకూ ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం కేరళ రాష్ట్రంలోని వయనాడ్. (ఇక్కడ అదనంగా కాఫీ ఇతర సుగంధ ద్రవ్యపు తోటలు కూడా ఉన్నాయి.) దక్షిణ కల్పెట్టలో ఎక్కువ తేయాకు తోటలు ఉన్నాయి. రోడ్డు మార్గాన చెంబ్రా పర్వత ప్రాంతంలో గల ప్రైవేట్ ఎస్టేట్‌నూ సందర్శించవచ్చు. సందర్శన కోసం: వయనాడు తేయాకు దేశంలో మనంతవాడిలోని ప్రియదర్శిని టీ ఎస్టేట్ పర్యాటకులకు విడిది కేంద్రంగా ఉంది. ఇక్కడి కొండలలో చెట్ల మీద గిరిజనుల ఇళ్లు కనిపిస్తాయి. అక్కడికి చేరుకోవాలంటే ట్రెక్కింగ్ తప్పనిసరి. అత్యంత ఎత్తులో ఉండే గిరిజనుల ఇళ్లు మనల్ని విస్మయానికి లోనుచేస్తాయి. ఎప్పుడు వెళ్లవచ్చంటే: సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు వర్షాకాలం. మిగతా రుతువుల్లో ఈ ప్రాంతం సందర్శనకు అనువైనది.
మణిరామ్ దేవన్ అనే వ్యాపారి అస్సాంలో తేయాకు పరిశ్రమను నెలకొల్పాడు. విదేశాలకు ఎగుమతి చేయాలని ఇక్కడ మొదటిసారి తోటల పెంపకం చేపట్టాడు. ఆ విధంగా 19వ శతాబ్దిలో మనకు తేయాకు పరిచయం అయ్యింది.తేయాకు పరిశ్రమలో అగ్రగామిగా చలామణి అవుతున్న చైనాకు బ్రిటన్ అడ్డుకట్టవేసింది. తేయాకు తోటల పెంపకంలో చైనా విత్తనాలు, వారి పెంపకం పద్ధతులనే ఆంగ్లేయులు అవలంబించారు.
తేనీరు... నోరూరు
ఈ నెల 10న ఓస్లోలో ప్రపంచ ప్రముఖులంతా ఏడాదికొకసారి కలిసి చేసే విందు భోజనంలో మన దేశ పరిమళం గుబాళించింది. నోబెల్ ప్రైజ్ వేడుకల గొప్పదనం అందరికీ తెలిసిందే! ఈ ప్రత్యేక వేడుకలో ఓప్రత్యేక తేనీటిని అక్కడి అతిరథులందరికీ సర్వ్ చేశారు. ఆ ప్రత్యేకత గల తేనీరు మన దేశంలోని ఈశాన్యరాష్ట్రమైన అస్సాంకు చెందినది. ఆ విధంగా ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ వేడుకలో అస్సాం టీ వార్తల్లోకెక్కింది. ఈ విందులో వడ్డించిన ప్రపంచంలోని పేరెన్నికగన్న 10,000 రకాల పదార్థాలలో మన దేశ సౌరభం అందరి ప్రశంసలు అందుకోవడం గర్వకారణం.