‘డీఎడ్’ ప్రవేశాల కోసం ఎదురుచూపులు
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ కోర్సుల ప్రవేశాలకు విద్యార్థులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ పాటికే డీఎడ్ కళాశాల ప్రవేశ పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. ఈ విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రభుత్వ పట్టించుకోవడం లేదు. త్వరగా స్థిరపడవచ్చనే ఉద్దేశ్యంతో ఉపాధ్యాయ కోర్సులపై మక్కువ చూపుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆ కోర్సులే లక్ష్యంగా పెట్టుకుని వివిధ కోచింగ్ సెంటర్లలో 20 వేల మందికి పైగా శిక్షణ తీసుకుంటున్నారు. జిల్లాలో 26 డీఎడ్ కళాశాలలుండగా.. ఈ విద్యా సంవత్సరంలో మరికొన్నింటికి అనుమతులు సిద్ధమయ్యాయి. వీటిలో మొత్తం సుమారు మూడు వేల మంది వరకు చేరే అవకాశం ఉంది. డీఎడ్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి రెండేళ్లపాటు ట్రైనింగ్ పూర్తి చేస్తే 2018లో ఎన్నికలకు ముందు వచ్చే డీఎస్సీలో ఉద్యోగాలు సంపాదించవచ్చని ఆశపడుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఎలాగూ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్న ఆశతో విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నారు. దీంతో ఈ ఏడాది డీఎడ్ ప్రవేశాలకు పోటీ తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు.
డీఎడ్పై పెరుగుతున్న డిమాండ్
భారీ స్థాయి ఫిట్మెంట్తో అమలవుతున్న పీఆర్సీ, పదవీ కాలం పెంపు వంటి అంశాలతో ఉపాధ్యాయ పోస్టులకు డిమాండ్ పెరిగింది. అందులోను పోటీ పరిమితంగా ఉన్న ఎస్జీటీ పోస్టులో మంచి భవిష్యత్ ఉండడంతో నిరుద్యోగ యువతీయువకుల చూపు అటు వైపే ఉంది. బీఎడ్ విద్యార్థులు సైతం మళ్లీ డీఎడ్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఎస్బీజీ పోస్టుల్లో చేరిన ఉపాధ్యాయులు ప్రైవేటుగా బీఎడ్ పూర్తి చేసి పదోన్నతితో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో సులువుగా చేరవచ్చు. దీంతో డీఎడ్ కోర్సులకు డిమాండ్ పెరుతోంది.దీనిని పసిగట్టిన ప్రైవేటు డీఎడ్ కళాశాలల యాజమాన్యాలు తమ కోటా సీట్లను ఒక్కొక్కటీ రూ. 1.20 లక్షల నుంచి రూ.1.5 లక్షలకు విక్రయిస్తున్నాయి. విద్యా సంవత్సరం మొదలు కావడంతో పాటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభమవుతున్నాయి. ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చేరి తరువాత డీఎడ్లో సీటు వస్తే మూడేళ్ల డీగ్రీ ఫీజును చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని యాజమాన్యాలు పేర్కొంటుండడంతో విద్యార్థులు డైలామాలో పడుతున్నారు.