జెడ్పీ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ధర్నా
ఏలూరు సిటీ : జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయుల ప్రావిడెంట్ ఫండ్ రుణాల మంజూరులో జరుగుతున్న అవకతవకలపై సత్వరమే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. స్థానిక జెడ్పీ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరై ధర్నా చేశారు. ధర్నా శిభిరానికి జిల్లా అధ్యక్షుడు పి.జయకర్ అధ్యక్షత వహించగా, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్సాబ్జీ శిభిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సాబ్జీ మాట్లాడుతూ జెడ్పీ కార్యాలయంలో పీఎఫ్ రుణాల మంజూరుకు చేసుకున్న దరఖాస్తులను అసంబద్ధమైన కారణాలతో తిప్పి పంపుతూ, లంచాలు ఇచ్చిన వారికి ఏ విధమైన డాక్యుమెంట్లూ లేకున్నా మైనస్ బ్యాలెన్స్ చూపించి రుణాలు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేస్తున్న సూపరింటెండెంట్ నాగరాజకుమారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రాష్ట్ర కార్యదర్శి ఎస్.జయప్రభ, జిల్లా గౌరవాధ్యక్షుడు ఎం.రామకృష్ణ, సహాధ్యక్షురాలు వి.కనకదుర్గ, జిల్లా కోశాధికారి పీవీ నరసింహారావు, జిల్లా కార్యదర్శులు పి.శివప్రసాద్, ఎ.విక్టర్, ఏకేవీ రామభద్రం, ఎంఐ రాజకుమార్, పి.సువర్ణరాజు పాల్గొన్నారు.