‘భగీరథ’కు మరో రూ.1,350 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌కు మరో రూ.1,350 కోట్ల రుణమిచ్చేందుకు యునైటెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించింది. గురువారం సచివాలయంలో పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్‌తో సమావేశమైన బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ బజాజ్.. వివిధ జిల్లాల్లో జరుగుతున్న భగీరథ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై చర్చించారు. మిషన్ భగీరథకు సాయమందించేందుకు దేశంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలు ముందుకు రావడం శుభ పరిణామమని స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్ అన్నారు. నాబార్డ్, హడ్కో వంటి సంస్థలు సహా 13 వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.28,938 కోట్ల పనులకు రుణ ఒప్పందం కుదిరిందన్నారు.