టెక్ మహింద్రా టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు వేతనం కట్
బెంగళూరు : టెక్ మహింద్రాలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనానికి కోత పడింది. కంపెనీలోని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ర్యాంకు కలిగిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు 10 శాతం నుంచి 20 శాతం వరకు వేతనం కోత పెడుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. గత కొన్ని త్రైమాసికాలుగా కంపెనీ పేలవమైన పనితీరు కనబరుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ నిర్ణయానికి ప్రభావితమవుతున్న 20 మంది ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీ సీఈవో సీపీ గుర్నాని, చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాకేష్ సోనీలకు లేఖలు రాశారు. మేనేజ్మెంట్ నుంచి టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వరకు అందరం దీన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం గుర్నాని, రాకేష్ సోనీలపై కూడా ప్రభావం చూపనుంది.
కంపెనీ పనితీరు మెరుగుపడిన అనంతరం వేతనాలు పునరుద్ధరణ అవుతాయని వారు భావిస్తున్నారు. వైస్ ప్రెసిటెడ్ స్థాయి నుంచి ఆపై స్థాయి 500 మంది ఎగ్జిక్యూటివ్‌ల వేతన పెంపును వాయిదా వేసిన టెక్ మహింద్రా, వేతనాన్ని పెంచకపోగా, ఈ వేతన కోతను ఆఫర్ చేసింది. ఆరేళ్ల కంటే ఎక్కువ అనుభవమున్న ఎగ్జిక్యూటివ్‌లందరూ ఈ నిర్ణయానికి ప్రభావితమవుతారు. ప్రస్తుతం అన్ని టాప్ ఐటీ సర్వీసు కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఒత్తిడిలో కొనసాగుతున్నారు. ఇన్ఫోసిస్ కూడా జాబ్ లెవల్ 7, ఆపై స్థాయి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాల పెంపును వాయిదావేసింది. కాగ్నిజెంట్ కంపెనీ అయితే ఏకంగా వాలంటరీ సెపరేషన్ ఇన్సెంటివ్ను ఆఫర్ చేసింది. ఐటీ వ్యయాలు తగ్గడం, కొత్త డిజిటల్ టెక్నాలజీల వైపు క్లయింట్లు మొగ్గుచూపుతుండటంతో ఐటీ ఇండస్ట్రీలో ఈ పరిస్థితి నెలకొంటోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.