తేడా తెలియకనే...
యువ కల్లోలం
ప్రేమించామని ఇంట్లో వారికి తెలియకుండా వెళ్లిపోవడం, విలువైన విద్యా సమయాలను కోల్పోవడం, పెద్దలంటే పడకపోవడం యుక్తవయసు పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ పరిపాటిగా మారిపోయింది. పెద్దలకు పిల్లల గొడవ ఏంటో అర్థం కాదు. పిల్లలకు తమలో కలిగే గందరగోళాన్ని పెద్దలకు ఎలా చెప్పాలో తెలియదు. పిల్లల గురించిన ‘చేదు నిజాలు’ ఎప్పటికో తెలిసి పెద్దలు నిర్ఘాంతపోతారు. తమ నమ్మకం పోగొట్టారని పరువు ప్రతిష్టలు మంటకలిపారని కోపంతో విరుచుకుపడతారు. గృహనిర్బంధం చేస్తారు. ఈ పరిణామాలు వారిని మరింత గందరగోళంలో పడేస్తాయి. పెద్దలు తమను ఎప్పుడూ అర్థం చేసుకోరని, తమ ప్రేమ గొప్పదని ఇంకా బలంగా నమ్ముతారు. లేదంటే తాము అల్లుకున్న బంధాన్ని తుంచేసి పెద్దలు చెప్పినదానికి తలవంచుతారు. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలు సమాజానికే సవాల్‌గా నిలుస్తున్నాయి. మీ ఇంట్లోనూ టీనేజర్ ఉన్నారా? అయితే ఇది మీకోసమే...
‘ఒక అబ్బాయి/అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారంటే అది ప్రేమ అని పొరబడుతున్నారు’ అంటారు సైకాలజిస్ట్ డా.సి.వీరేందర్. ఈయన ‘టీనేజ్ టెంప్టేషన్స్’పై 8 ఏళ్లుగా 200 కళాశాలల్లో సదస్సులు ఏర్పాటు చేశారు. యువతీ, యువకులు, తల్లితండ్రుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇదే అంశంపై ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూ వచ్చారు. యుక్త వయసులో ప్రేమ, ఆకర్షణల పట్ల కలిగే ఆందోళ నలను ఎలా చక్కబెట్టుకోవాలో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
ఆకర్షణను ప్రేమ అనుకుంటున్నారు...
‘‘యుక్తవయసులో పిల్లలకు ప్రేమకు - ఆకర్షణకు తేడా తెలియడం లేదు. తాత్కాలిక ఆనందాలు, స్నేహితుల ముందు గొప్ప అనిపించుకోవడాలు, సినిమాల్లో చూపిన ప్రేమ సన్నివేశాలు జీవితంలోనూ నిజమని నమ్మడాలు.. జరుగుతున్నాయి. కొన్నాళ్లకు ఇద్దరిలో ఎవరో ఒకరిలో ఆకర్షణ తగ్గిపోతుంది. ఆ ఒక్కరు ప్రేమ నుంచి డ్రాప్ అవుతారు. అప్పుడు సదరు వ్యక్తి తనను మోసం చేశాడు/చేసింది అనే భావనకు వచ్చేస్తారు. ఆ భావనను భరించలేరు. ఆ బాధలో అవతలివారిని హింసిస్తేనో, తమను తాము హింసించుకుంటేనో ఉపశమనం లభిస్తుందని భావిస్తారు. అలాంటి ఉద్రేకంలోనే దారుణాలు జరుగుతుంటాయి.
ఎక్కువ సమయం తరగతిలోనే...
పిల్లలు రోజులో ఎక్కువ గంటలు ఉండేది తరగతి గదిలోనే! లెక్చరర్లు ‘చదువు’ ఒత్తిడి పెడతారు. ఇంటి దగ్గర ఇదే ఒత్తిడి ఉంటుంది. ఇలాంటప్పుడు తాత్కాలిక ఆనందాలను ఇచ్చే వాటి కోసం పిల్లలు వెతుకుతారు. అందులో ఫోన్, ఇంటర్నెట్ ప్రధానమైనవి. తమ పరిధిలో ఉన్న తోటి విద్యార్థులతో స్నేహం చేయడం మొదలుపెడతారు. అందులో అమ్మాయి-అబ్బాయి స్నేహం చేస్తే తొందరగా అవతలి వ్యక్తితో తమ భావాలను పంచుకోవడం సహజాతి సహజంగా జరిగిపోతుంటాయి. వీటికి తోడు వారి స్నేహితులే ‘ఇది ప్రేమ’ అంటూ ప్రోత్సహిస్తుంటారు. దీనివల్ల స్నేహం-ప్రేమ తేడాలు తెలియక గందరగోళానికి లోనవుతుంటారు.
తాత్కాలిక ఆనందాల కోసం... ఒత్తిడి నుంచి బయటపడటానికి ఆనందం కోసం వెతుకుతారు. ఆనందం కోసం ఆకర్షి తులవుతారు. ఆకర్షణను ప్రేమ అనుకుం టారు. దీంట్లో.. యుక్తవయసు పిల్లలు.. చాలా మంది లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ప్రేమ సందేశాల్లో బయటకు చెప్పడానికి వీలులేని అసభ్యపదాలను వాడుతున్నారు. ఫోన్లు, ఇంటర్నెట్లలో థర్డ్ గ్రేడ్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు. చివరికి ఇంట్లో చెప్పకుండా పారిపోతున్నారు, లేదా ఇంట్లో వారికి తెలిస్తే గొడవలు జరుగుతాయని భయపడి ప్రాణాలు తీసుకుంటున్నారు. పరిస్థితి అంతవరకూ తెచ్చుకోకూడదంటే...
తల్లితండ్రులూ మాట్లాడండి... పిల్లల్ని మాట్లాడనివ్వండి..!
ఈ రోజుల్లో కుటుంబంలో అందరూ ఎవరి పనుల్లో వారు తీరిక లేకుండా ఉంటున్నారు. పిల్లలకు కావల్సిన అవసరాలు మాత్రమే పెద్దవాళ్లు చూస్తున్నారు తప్ప, వారు ఏం చేస్తున్నారో పట్టించుకోవడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకునేకంటే ముందే జాగ్రత్తపడటం మేలు. యుక్తవయసులో సాధారణంగా తటస్థపడే ప్రేమ-ఆకర్షణల గురించి, సమాజ తీరుతెన్నుల గురించి పిల్లలతో మాట్లాడాలి. చర్చించాలి. పిల్లలూ ఆ చర్చలో పాల్గొనేలా చూడాలి. ఎన్నో సమస్యలకు ఈ అవగాహన చర్చలే పరిష్కార మార్గాలు అవుతాయి.
అర్థం చేసుకోండి...
పిల్లలు ఏ పరిస్థితిలో ‘టెంప్టేషన్స్’కు లోనవుతున్నారో గమనించండి. మీ అబ్బాయి/ అమ్మాయి ప్రేమలో ఉన్నారనుకుంటే అదొక సహజమైన పరిణామంగా పరిగణించండి. పిల్లలతో స్నేహపూర్వకంగా సంభాషించండి. వారి లోపాలను సున్నితంగా తెలియజేయండి. అప్పటికీ మార్పు రాకపోతే నిపుణుల సలహా తీసుకోవడంలో అలక్ష్యం చేయవద్దు’’ అని తెలియజేస్తున్నారు డా. వీరేందర్.
ప్రేమ-ఆకర్షణ.. దేని దారి దానిదే! రెండింటినీ కలిపి జీవితాలను హింసకు గురిచేయకూడదు. యుక్తవయసు వచ్చాక ఈ విషయం పిల్లలకు అర్థమయ్యేలా తెలియజెప్పడం పెద్దల బాధ్యత. పెద్దల సూచనలు తమ మంచికే అనే విషయాన్ని పిల్లలూ గ్రహిస్తే సమాజంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవు. ఎవరి జీవితాలూ ఛిద్రం కావు.
- నిర్మలారెడ్డి, సాక్షి ఫ్యామిలీ
టీనేజర్లూ... గందరగోళంలో ఉన్నారా?!
ఇది మీ వేదిక...
టీనేజ్‌లో ‘ప్రేమ’పట్ల ఉండే అవరోధాలు, ఆందోళనలు, ఎదుయ్యే అవమానాలు, ఛీత్కారాలు, భయాలు.. ఇలాంటి సంశయాలన్నీ తీర్చుకోవడం చాలా అవసరం. అందుకోసం ‘యు అండ్ మి టీ క్లబ్’ ద్వారా వేదికను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు 200 కళాశాలల్లో ‘టీనేజ్ టెంప్టేషన్స్’ అనే అంశంపై సదస్సులు ఏర్పాటు చేశాం. ప్రేమంటే ఏమిటి, ప్రేమలో ఉండే ‘కిక్’, దాంట్లో ఉండే అన్ని రకాల లక్షణాలు, ఆకర్షణలు, సంశయాలు, స్నేహాల గురించి చర్చించి ఒక పారదర్శక నమూనాను నేటి యువతీ యువకులకు అందించాలనేది ఈ ప్రయత్నం. 10వ తరగతి నుంచే పిల్లలకు ‘టెంప్టేషన్స్’పై అవగాహన పెంచితే యుక్తవయసులో వచ్చే రకరకాల ఆందోళనలు ఆలోచనగా రూపుదిద్దుకుంటాయి. అప్పుడు వారు అభివృద్ధి దిశగా దృష్టి పెడతారు. ఈ 12, 13 తేదీల్లో కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో ‘టీనేజ్ టెంప్టేషన్స్’ అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నాం. మరిన్ని వివరాలను ఠీఠీఠీ.డౌఠఝ్ఛ.జీజౌ కు లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు. - డా. సి.వీరేందర్, సైకాలజిస్ట్, హైదరాబాద్
వర్ష రోజూ కాలేజీకి వెళుతోంది. కానీ, ఆమె ఏడాదిగా క్లాస్‌లకు హాజరవడంలేదని పరీక్షల ముందు కాలేజీ వారు సమాచారం ఇవ్వడంతో ఇంట్లోవారు నిర్ఘాంతపోయారు.
***
సురేశ్ కిందటేడాది వరకు ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. తన క్లాస్మేట్ని ప్రేమించి, క్లాస్‌లు ఎగ్గొట్టి ఆమెతో తిరిగాడు. ఏడాది తిరిగేసరికల్లా ఆమె ‘సారీ’ చెప్పి పెద్దలు చూసిన సంబంధం చేసుకుని వెళ్లిపోయింది. తట్టుకోలేని సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు.