చైనాకు భారత్ ‘విమాన హెచ్చరిక’
న్యూఢిల్లీ: కొన్ని నెలల కిందట చైనా బలగాలు జమ్మూ కాశ్మీర్ లోని దౌలత్‌బేగ్ ఓల్డీ(డీబీఓ)లోకి చొరబడిన నేపథ్యంలో భారత వాయుసేన దీటైన హెచ్చరిక చేసింది. పెద్ద సంఖ్యలో సైనికులను, సామగ్రిని మోసుకెళ్లే ‘సీ-130జే’ రకానికి చెందిన భారీ రవాణా విమానం ‘సూపర్ హెర్క్యులెస్’ను తొలిసారిగా మంగళవారం డీబీఓ వైమానిక స్థావరంలో దింపింది. ఉదయం 6.54కు ల్యాండయిన హెర్క్యులెస్‌లో ఆర్మీ కమాండింగ్ అధికారి తేజ్బీర్ సింగ్, ‘వీల్డ్ వైపర్స్’ కమాండోలు వచ్చారు. లడఖ్ ప్రాంతంలోని అక్సాయ్ చిన్‌లో 16,614 అడుగుల(5,065 మీటర్లు) ఎత్తులో ఉన్న డీబీఓ స్థావరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వైమానిక స్థావరం.
హెర్క్యులెస్ వినియోగంలోకి రావడంతో సరిహద్దులోకి జవాన్లను, యుద్ధ సామగ్రి తరలింపు, కమ్యూనికేషన్ల నిర్వహణ సజావుగా సాగనున్నాయి. ఈ విమానం 20 టన్నుల బరువును అవలీలగా మోసుకెళ్తుంది. భారత్, చైనాలు మూడేళ్ల విరామం తర్వాత చొరబాట్లు, ఇతర అంశాలపై మంగళవారమే చర్చలు జరిపిన నేపథ్యంలో ‘హెర్క్యులెస్’ను డీబీఓకు పంపడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనా బలగాలు డీబీఓలోకి చొరబడడంతో ఇరు దేశ సైన్యాల మధ్య ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే.