కాలేజీ టాపర్ కన్నీటి కథ!
అమ్మానాన్న చదువు వద్దంటున్నారు.. ఏం చేయాలి?
టేక్మాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల టాపర్ శిరీష ఆవేదన
టేక్మాల్: మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండలం కాద్లూర్ గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు నీళ్ల దేవమ్మ, రమేశ్‌లకు అర ఎకరం భూమి ఉంది. ముదిరాజ్లైన వీరి కుల వృత్తికి సరైన ఆదరణ లేక.. అర ఎకరం భూమిలో ఏమీ పండక.. దంపతులిద్దరూ కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె శిరీష టేక్మాల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్, మిగతా ఇద్దరు ప్రభుత్వ హైస్కూ ల్లో చదువుతున్నారు. శిరీష ప్రతికూల పరిస్థితులకు ఎదురీదింది. పేదరికాన్ని, దాంతో వచ్చే ఇబ్బందులన్నీ ఎదుర్కొని.. ఇంటర్ వరకు బాగా చదివి.. శ్రమకు తగ్గ ఫలితం సాధించింది.
శుక్రవారం విడుదలైన ఇంటర్ సెకండియర్ (బైపీసీ) ఫలితాల్లో 1,000 మార్కులకుగాను, 902 మార్కులు సాధించి టేక్మాల్ కళాశాల టాపర్‌గా నిలిచింది. కానీ,శిరీష ఇప్పుడు పై చదువులను చదివేదెలా? అని ఆవేదన పడుతోంది. ప్రభుత్వ కాలేజీలో చదివి అన్ని మార్కులు సంపాదించినా.. ఎంసెట్ రాసి డాక్టర్ కావాలనుకున్న ఆ అమ్మాయి ముఖంలో ఇప్పుడు ఆనందం లేదు. ఎందుకంటే.. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా శిరీషకు పై చదువులు వద్దని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు.
కానీ, శిరీష మాత్రం ‘నాకు ఇంకా చదువుకోవాలని ఉంది. కానీ, అమ్మా నాన్న మాత్రం.. మనకు స్తోమత లేదు కదా.. పై చదువులకు వెళ్లొద్దు.. అంటున్నారు. ప్రభుత్వం కానీ లేదా మరెవరైనా దాతలుగానీ, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలవారుగానీ నా చదువుకు సాయం చేస్తారా?’ అని శనివారం టేక్మాల్ ‘సాక్షి’ విలేకరి వద్ద వాపోయింది. ఎంసెట్ రాస్తున్నావా? అని అడిగితే.. ఎంసెట్‌కు దరఖాస్తు చేసేందుకు.. ఆ సమయంలో డబ్బులు కూడా లేవు.. అని కన్నీటి పర్యంతమైంది. ఇప్పటికీ తనను ఎవరైనా ఆదుకుంటే పై చదువులు చదువుకుంటానని, బీఎస్సీ డిగ్రీలో చేరి, ఎంసెట్ ప్రిపేరవుతానని, ఎలాగైనా మెడికల్ సీటు సాధించి, డాక్టర్ అవుతానని శిరీష ఆత్మ విశ్వాసంతో చెబుతోంది.