ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఖబడ్దార్..!
- విలేకరులకు బాబూమోహన్ అనుచరుల హెచ్చరిక
- రూ. 50వేలు ఇచ్చినట్లు నేను చెప్పలేదు
- కాంట్రాక్టర్ రవీందర్‌గౌడ్
సంగారెడ్డి మున్సిపాలిటీ: అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్‌పై వ్యతిరేక కథనాలు రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టేక్మాల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు యూసుఫ్, అల్లాదుర్గం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు భిక్షపతి విలేకరులను హెచ్చరించారు. కొందరు పనిగట్టుకొని ఎమ్మెల్యేపై అసత్య కథనాలు రాస్తున్నారని, ఇకపై అలాంటివార్తలు వస్తే సహించేది లేదన్నారు. ఇటీవల జేఎన్టీయూలో విద్యార్ధులకు, మెస్ కాంట్రాక్టర్ మధ్య వివాదం జరిగి, నెలకు రూ. 50 వేలు ఎమ్మెల్యేకు కాంట్రాక్టర్ ఇస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ కథనాన్ని ఖండించేందుకు మెస్ కాంట్రాక్టర్ రవీందర్‌గౌడ్ గురువారం సంగారెడ్డిలోని ఐబీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రవీందర్‌గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తారా.. అంటూ మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే ఆదేశాల మేరకే మెస్ కాంట్రాక్టు కోసం టెండర్ వేశానని ఇందులో ఎమ్మెల్యేకు మామూళ్లు ఇస్తున్న వచ్చిన ఆరోపణలు నిరాధారమన్నారు. నిబంధనల ప్రకారమే మెస్ కాంట్రాక్టు తీసుకున్నానన్నాన్నారు. టెండర్ సమయంలో ఐదుగురు దరఖాస్తులు తీసికెళ్లినా ఎవరూ వేయలేదని, దీంతో ఎమ్మెల్యే తనను వేయమని కోరితే టెండర్ వేశానన్నారు. తాను ఎమ్మెల్యేకు నెలకు రూ.50 వేలు ఇస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను అన్నట్లు నిరూపిస్తే జేఎన్టీయూ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానన్నారు.